హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మండల, డివిజన్, పట్టణ కమిటీ అధ్యక్షుల నియామకానికి టీపీసీసీ రూపొందించిన నిబంధనలు ఇప్పుడు ఆ పార్టీలో కొత్త రచ్చకు దారితీశాయి. కిందిస్థాయి కమిటీల అధ్యక్షులుగా ఎన్నుకునే వ్యక్తులు కనీసం మూడేండ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు (డీసీసీ), ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తాజాగా లేఖ రాశారు. ఈ నిర్ణయం ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరి అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకున్న నేతలకు మింగుడుపడటం లేదు. ప్రస్తుతం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో చాలామంది ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినవారేనని గుర్తుచేస్తూ.. పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేనివారికి ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేషన్ పదవులు కట్టబెట్టినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు తమను పార్టీలోకి తీసుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎలాంటి న్యాయం జరగలేదని, ఇప్పుడూ పార్టీలో పాతవారికే పదవులంటూ కొత్త మెలిక పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు మూడేండ్ల నిబంధనను టీపీసీసీ తెరపైకి తేవడం వేరే కారణాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వంలో, పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులకు పెద్దపీట వేశారని, కిందిస్థాయిలో కూడ ఆయన వర్గానికి చెందిన నాయకులకే అధ్యక్ష పదవులు కట్టబెటితే రాబోయే రోజుల్లో అధిష్ఠానం మాట వినేవారే ఉండరన్న ఉద్దేశంతోనే మూడేండ్ల నిబంధన తీసుకొచ్చారని కాంగ్రెస్‌లోని ఓ వర్గం భావిస్తున్నది. మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమ అనుచరులకే పదవులు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే టీపీసీసీ మూడేండ్ల నిబంధనను తీసుకొచ్చిందన్న వాదన కూడా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఈ నిబంధనతో తమకు కొత్త తలనొప్పులు తప్పవని పలువురు ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు వాపోతున్నారు.