నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 17: కాంగ్రెస్ పార్టీపై కర్షకులు కన్నెర్రజేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ మస్త్ అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు..’ అంటూ ముక్తకంఠంతో రైతులు నినదించారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తుంటే.. రైతులపై రేవంత్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సదస్సులకు రైతులు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. కొన్ని చోట్ల ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు. అన్నదాతలకు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని రైతు సభల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా మావలలో రైతులు ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్తేజ పర్చారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని అమ్మపాలెంలో రైతులతో కలిసి వెయ్యి ట్రాక్టర్లు, 500 బైక్‌లతో వెంకటాపురం వరకు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని రైతువేదిక సభలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎమ్మెల్సీ పౌడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. మూడు పంటలకు నీరందించే కేసీఆర్ కావాలా? 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా? రైతులు ఆలోచించుకోవాలని కౌశిక్‌రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎంపీడీవో కార్యాలయ నుంచి సోమన్‌పల్లి రైతు వేదిక వరకు ట్రాక్టర్ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రైతులతో కలిసి స్వయంగా ట్రాక్టర్ నడిపారు.
కర్రుకాల్చి వాతపెట్టాలి: పువ్వాడ
రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతులు కర్రు కాల్చి వాతలు పెట్టాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబు ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకానిలోని రైతువేదికలో సోమవారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం- మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం’పై రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సాగుపై కనీస అవగాహన లేకుండా పంటకు రోజుకు మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
వారిని నిలదీయాలి: శ్రీనివాస్‌గౌడ్
వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తు అవసరం లేదంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా ఓబులాయపల్లి రైతువేదికలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రం అగ్నిగుండమై కాంగ్రెస్ పార్టీని దహిస్తుందని అన్నారు. చిన్నదర్పల్లి శివారులో రోడ్డు పక్కన పొలంలో కూలీలు నాట్లు వేస్తుంటే మంత్రి వెళ్లి వారితో కలిసి వరి నాట్లు వేశారు.
కాంగ్రెస్‌ను ఖతం చేయాలి: ఎర్రబెల్లి
రైతాంగానికి 24 గంటల కరంటు వద్దు 3 గంటల చాలన్న కాంగ్రెస్‌ను రైతులంతా ఏకమై ఖతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ముత్తారం, పాలకుర్తి గ్రామాల్లోని రైతుల వేదికల వద్ద రైతుల సదస్సు మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. 3 గంటల కరెంట్ మస్త్ అన్న కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 3 పంటల బీఆర్ఎస్ కావాలా.. 3 గంటల కరెంట్ అన్న కాంగ్రెస్ కావాలా అని రైతులను అడుగగా.. 3 గంటలన్న కాంగ్రెస్‌ను బొందపెడుతామని రైతులు శపథం చేశారు.
మీ అబ్బ సొత్తు ఏమైనా ఇస్తున్నరా?: వేముల
రైతును రాజు చేసే కేసీఆర్ కావాల్నా.. అన్నదాతలను ఆగం జేసే కాంగ్రెస్ కావాల్నా.. రైతులు ఆలోచించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. 24 గంటల కరెంట్ వద్దన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల వీడియోను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ రైతువేదిక వద్ద రైతుల ఎదుట ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎకరం పారడానికి గంటకరెంట్ చాలని రేవంత్‌రెడ్డి కండకావరంతో మాట్లాడుతుండు. రోజంతా కరెంట్ ఇస్తుంటే నీకు, నీ పార్టీకి ఎందుకు కడుపుమంట? మీ అబ్బ సొమ్ము ఏమైనా ఖర్చు పెట్టి రైతులకు కరెంట్ భిక్షమేస్తున్నమా? రేవంత్‌రెడ్డి కడుపులో ఎంత విషముందో రైతులు గమనించాలె. కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం. రేవంత్‌రెడ్డి కడుపులో ఎంత విషముందో రైతులు గమనించాలె. ఉచిత విద్యుతే అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు అంటుండ్రు. దీనిపై రైతులు ఆలోచన చేయాలె. మోసపోతే గోసపడతామని గమనించాలె’అని మంత్రి వేముల చెప్పారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ అంధకారమే: గుత్తా
కాంగ్రెస్ మూడు గంటల కరెంట్, సీఎం కేసీఆర్ మూడు పంటల విధానంపై రైతులు గ్రామాల్లో చర్చ పెట్టాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. గొప్పలు చెప్పే కాంగ్రెస్.. ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నదా? అని నిలదీశారు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట రైతువేదికలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి వెళ్తుందని, బావుల కాడ రాత్రి వేళ మళ్లీ పడిగాపులు కాయాల్సి వస్తుందని హెచ్చరించారు.