హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పై సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు నిరాశగా ఉన్నారని మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమా త్రం బాగోలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేల తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాగైతే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనన్న భావనను వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజలు సంతృప్తికరంగాలేరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని మీడియాలో కథనాలు వస్తుండటం, ఎమ్మెల్యేలు, మంత్రు లు కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని సొంతపార్టీ నేతల నుంచే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మహేశ్‌గౌడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ ఉత్సాహపూరిత వాతావరణం కనిపించడంలేదని తెలిపా రు. మంత్రులు, ఎ మ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని హితవు పలికారు. పనితీరును పునఃసమీక్షించుకోవాలని, ఏం చేస్తున్నామన్నది బేరీజు వేసుకోవాలని సూచించారు. జూన్ చివరి నాటికి టీపీసీసీ కార్యవర్గ నియామకం, మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశమున్నదని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు.