హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం ఎంతో అవసరమని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న ప్రపంచ ట్రావెల్ అండ్ టూరిజం మీట్ (ఎఫ్ఐటీయూఆర్)- 2023లో భాగంగా తెలంగాణ టూరిజం ప్రమోషన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కర్ణాటక, రాజస్థాన్‌తోపాటు పలు రాష్ట్రాల పర్యాటకశాఖ ఉన్నతాధికారులతో శనివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
దేశానికి వచ్చిన పర్యాటకులకు వివిధ రాష్ట్రాల్లోని ప్రాముఖ్యత కలిగిన టూరిజం కేంద్రాల సమాచారా న్ని అందించాలని సూచించారు. తెలంగాణలో టూరి జం అభివృద్ధికి, పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చేపడుతున్న కార్యక్రమాలను వివరించగా, ఆయా రాష్ర్టాల ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు.
సమావేశంలో ఇండియా టూరిజం అదనపు సెక్రటరీ రాకేశ్‌వర్మ, తెలంగాణ రాష్ట్ర ప ర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రాజస్థాన్ టూరిజం ముఖ్య కార్యదర్శి గాయత్రీరాథోడ్, రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మేంద్రసింగ్ రాథోడ్, కర్ణాటక రాష్ట్ర టూరిజం అడ్వైజర్ హెచ్‌టీ రత్నాకర్, ఐవోటీఏ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, రాజస్థాన్ టూరిజం ఎండీ విజయ్‌పాల్‌సింగ్, తెలంగాణ టూరిజం డిప్యూటీ కమిషనర్ ఓంప్రకాశ్, ఇతర రాష్ట్రాల టూరిజం అధికారులు పాల్గొన్నారు.