హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరో అద్భుత కార్యక్రమానికి వేదిక కానున్నది. 25న జాతీయ పర్యాటక దినోత్సవం ప్రధాన ఈవెంటన్ను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్’గా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. దేశంలో మొత్తం ఐదు ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తారు. భూదాన్ పోచంపల్లిలో మెయిన్ ఈవెంట్, రీజినల్ స్థాయిలో గుజరాత్‌లోని ద్వారక, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాతోపాటు మరో రెండు ప్రాంతాలను ఎంపిక చేయనున్నది. భూదాన్ పోచంపల్లిలో నిర్వహించే కార్యక్రమానికి విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి దాదాపు 500 మంది ప్రముఖులను ఆహ్వానిస్తామని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ర్టానికి సూచించింది. కేంద్రం సమాచారంతో గురువారం పర్యాటక శాఖ అధికారులు పోచంపల్లిలో పర్యటించారు. వేడుకల నిర్వహణ స్థలాన్ని పరిశీలించి, పోచంపల్లి ప్రత్యేకతలు, తెలంగాణ వంటకాలతో స్టాళ్ల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 24, 25 తేదీల్లో వేడుకలు ఉంటాయని అధికారులు తెలిపారు.