హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ- కొరియా మధ్య పర్యాటక, సాంస్కృతిక సహకారం బలోపేతం కానున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ-కొరియన్ కల్చరల్ సెంటర్లు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. తెలంగాణ-కొరియా మధ్య పర్యాటక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరుపక్షాలు చర్చించాయి. భారత్లోని కొరియన్ కల్చరల్ సెంటర్(కేసీసీఐ) డైరెక్టర్, కొరియన్ రాయబార కార్యాలయం కల్చర్ అండ్ ప్రెస్ కౌన్సిలర్ హ్వాంగ్ ఇల్యాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది.