హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై ట్రూప్ అప్ చార్జీల రూపంలో ఏకంగా రూ.8,532 కోట్ల భారాన్ని మోపేందుకు డిస్కమ్‌లు సిద్ధమయ్యాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాలకు (2022-23, 2023-24, 2024-25) సంబంధించి ట్రూ అప్ చార్జీలకు అనుమతించాలని కోరుతూ ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు (టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్) విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి పిటిషన్‌ను సమర్పించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టీజీ ఎస్పీడీసీఎల్ రూ.4,104 కోట్లు, టీజీఎన్పీడీసీఎల్ రూ.2,779 కోట్లు ట్రూ అప్ చార్జీలు విధించాలని ప్రతిపాదించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి టీజీఎస్పీడీసీఎల్ రూ.2,335 కోట్లు, టీజీఎన్పీడీసీఎల్ రూ.113 కోట్లు ట్రూ అప్ చార్జీలుగా ప్రతిపాదించాయి. దీంతో ఆ రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం ట్రూ అప్ చార్జీలు రూ. 9,331 కోట్లకు చేరనున్నాయి. కానీ, 2024-25 ఆర్థిక సంవత్సరం ఈ రెండు డిస్కమ్‌ల పరిధిలో రూ.799 కోట్లు ట్రూ డౌన్ అయ్యింది. ఇందులో టీజీఎస్పీడీసీఎల్ రూ.196 కోట్లు, టీజీఎన్పీడీసీఎల్ రూ.603 కోట్లు ట్రూ డౌన్ అయినట్టు చూపాయి. ఈ మొత్తాన్ని రూ.9,331 కోట్ల నుంచి మినహాయించి రూ.8,532 కోట్ల ట్రూ అప్ చార్జీలు వసూలు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ నెల 31లోగా తెలియజేయవచ్చు. రెండు డిస్కమ్‌ల పిటిషన్లపై ఫిబ్రవరి 27న ఈఆర్సీ హైదరాబాద్‌లోని విద్యుత్తు నియంత్రణ భవన్లో బహిరంగ విచారణ జరపనున్నది.
ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్లు
ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుందా? లేక ఆ భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపుతుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవలే ఏపీలోని ప్రభు త్వం రూ.4,498 కోట్ల ట్రూ అప్ చార్జీలను తామే భరిస్తామని ప్రకటించడంతో ఆ రాష్ట్రంలోని వినియోగదారులకు భారం తప్పింది. దీంతో తెలంగాణలో కూడా ప్రభుత్వమే ట్రూ అప్ చార్జీలను చెల్లించాలని, ఆ భారాన్ని వినియోగదారులపై మోపరాదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్ల మేరకు ట్రూ అప్ చార్జీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే చెల్లించాలనుకుంటే అందుకు ప్రజాధనాన్నే వెచ్చించి, ఆ మొత్తాన్ని ఏదో రూపంలో మళ్లీ ప్రజల నుంచే వసూలు చేసుకోవాల్సి ఉంటుందని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు.
ట్రూ అప్/ట్రూ డౌన్ అంటే..
విద్యుత్తు కొనుగోలు అంచనాలకు, వాస్తవిక కొనుగోలుకు మధ్య ఉన్న తేడానే ట్రూ అప్ లేదా ట్రూ డౌన్ అంటారు. అంచనాలకు మించితే ట్రూ అప్‌గా, తగ్గితే ట్రూ డౌన్‌గా వ్యవహరిస్తారు. విద్యుత్తు సంస్థల ఖర్చులను నియంత్రిస్తూ దేనికి ఎంత ఖర్చుపెట్టాలన్న వివరాలతో కూడిన టారిఫ్ ఆర్డర్‌ను ఈఆర్సీ జారీచేస్తుంది. దీనికి లోబడే డిస్కమ్‌లు ఖర్చు చేయాలి. కానీ, విద్యుత్తు కొనుగోళ్లు, వడ్డీలు, నిర్వహణ (ఓఅండ్ఎం) అవసరాలకు డిస్కమ్‌లు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రాథమిక అంచనాలకు మించిన వ్యయాన్ని సర్దుబాటు చేసుకోవడంలో భాగంగానే ట్రూ అప్ చార్జీల వసూలుకు డిస్కమ్‌లు ఈఆర్సీ అనుమతి కోరాయి.