హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని టానిక్ ఎలైట్ మద్యం షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొంటూ నిర్వాహకులు ఇచ్చిన రెన్యూవల్ దరఖాస్తును తిరస్కరించారు. ఈ మేరకు శనివారం రాత్రి రిజెక్షన్ ఆర్డర్ పంపి.. ఆదివారం ఉదయం దుకాణంలోని రూ.1.70 కోట్ల విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన 10,291 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అనుమతితో 2016 నుంచి ఈ షాపు కొనసాగుతుండగా.. ఆగస్టు 31న గడువు ముగిసింది. దీంతో సెప్టెంబర్ 1 నుంచి షాపు నడపడం చట్టరీత్యా నేరమని మీడియా సమక్షంలో మద్యం సీసాల లెకింపు అనంతరం దుకాణానికి సీల్ వేశారు. కార్యక్రమాన్ని హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి, సీఐ వాసుదేవరావు పర్యవేక్షించారు.