హైదరాబాద్, నవంబర్ 24(నమస్తేతెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా పనుల జాతరను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జీ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11గంటలకు గ్రామసభల్లో రాజ్యాంగ ప్రవేశిక చదివేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల జాతరలో భాగంగా ఉపాధిహామీ పథకం కింద రూ.2750 కోట్లతో పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.