Talasani Srinivas Yadav | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడి తర్వాత డెడికేటెడ్ కమిషన్‌ను వేశారని తెలిపారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్‌తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంచలేదని పేర్కొన్నారు. ఇంతలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హడావుడిగా జీవో ఇచ్చారని చెప్పారు. ఆ జీవో చెల్లదని బీఆర్ఎస్ నాయకులు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తీరా చూస్తే ఆ జీవోను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు.
ఇప్పుడు పంచాయతీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన జీవో నిలబడుతుందా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో రేపు బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల సమావేశం కానున్నారని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒప్పుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ గుర్తులు లేకుండా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని.. అలాంటి ఈ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి జిల్లాల్లో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 75 ఏండ్ల తర్వాత కూడా బీసీలు ఇంకా భిక్షమెత్తుకోవాలా అని నిలదీశారు. నూటికి 50 శాతానికి పైగా జనం ఉన్న బీసీలు ఉద్యమం చేస్తారని వెల్లడించారు. బీసీల భవిష్యత్ కార్యాచరణను రేపు ప్రకటిస్తామని తెలిపారు.