హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు మళ్లీ పెరిగాయి. ఏప్రిల్లో రూ.10కే కిలో పలికిన టమాటా.. ఇప్పుడు ఏకంగా రూ.50 దాటింది. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పంట పండించిన రైతులకు మాత్రం మద్దతు ధర దొరకడం లేదు. ఎండల తీవ్రత, సాగు తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో ట మాటా రైతు గోడు మాత్రం మరోలా ఉంది. హైదరాబాద్లోని హోల్సేల్ మారెట్లలో కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య అమ్ముడవు తుండగా, రిటైల్ షాపులు, సూపర్ మారెట్లలో కిలో రూ.50 నుంచి రూ. 60కి చేరుతున్నది.
టమాటా ధరలు పెరుగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ తమవద్ద తగినంత పంట లేదని వాపోతున్నారు. నెల రోజుల క్రితం వ్యాపారులు రైతుల దగ్గర నుంచి కిలో టమాటా రూపాయికే కొనుగోలు చేశారు. మారెట్లో ప్రజలకు రూ.5 నుంచి రూ.15 వరకు అమ్మారు. అయితే కూలీల ఖర్చులు, రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో విసుగు చెందిన రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేశారు. కొందరు రోడ్లపై పారబోసి నిరసన తెలుపుతున్నారు.