Toll Tax | హైదరాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): రాష్ట్ర రహదారులపై కూడా ఇక టోల్‌బాదుడు తప్పేలాలేదు. త్వరలోనే వీటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి ప్రతిఫలంగా రాష్ట్ర రహదారులపై టోల్‌ప్లాజాలను ఏర్పాటుచేసి, ట్యాక్స్ వసూళ్ల అధికారాన్ని ఆయా ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తున్నది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖను ఆదేశించగా, అధికారులు పలు ప్రధాన రోడ్లను గుర్తించి నివేదిక అందించినట్టు సమాచారం.
రాష్ట్రంలో రాష్ట్ర రహదారులు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు తదితర అన్నీ కలుపుకొని ఆర్అండ్బీ శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల పొడవైన రోడ్లున్నాయి. 2690కిలోమీటర్లమేర ఉన్న జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యత కేంద్రం పరిధిలో ఉండగా, రాష్ట్ర రహదారుల నిర్వహణ బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదే. అయితే కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్వహణను పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేయడంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. టెండర్లు పిలిచినా బిల్లులు వస్తాయో.. రావో అనే అనుమానంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రహదారుల నిర్వహణ బాధ్యతలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని నిశ్చయించింది.
ఇప్పటికే అందిన నివేదిక
3,152కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న స్టేట్ హైవేస్‌పై, అలాగే, కొన్ని జిల్లా రోడ్లపై కూడా టోల్ వసూలుకు అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీంతో త్వరలోనే ప్రభుత్వం దీనిపై విధానపరమైన ప్రకటన చేసే అవకాశముంది. టెండర్ల పద్ధతిలో వీటిని ప్రైవేట్‌కు కట్టబెట్టనున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో కొంతకాలంగా రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నది. టెండర్ల పద్ధతిలో జోన్లవారీగా వివిధ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. నిర్ధారిత మొత్తానికి ఏటా కొంతశాతం పెంచుతూ ఏజెన్సీలకు చెల్లిస్తున్నారు. ఎక్కడ గుంత పడినా, రోడ్డుకు నష్టం జరిగినా వెంటనే పూడ్చాల్సిన బాధ్యత ఆయా ఏజెన్సీలపై ఉంటుంది. ఐదేళ్లకోసారి రోడ్ల పునరుద్ధరణ పనులు మాత్రం జీహెచ్ఎంసీ విడిగా నిర్వహిస్తుంది. కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే ఏజెన్సీ చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రప్రభుత్వం ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
రాష్ట్రంలో రహదారుల వివరాలు…