గ్యాస్ ధరలు పెంచిండ్రు.. పెట్రోల్ ధరలు పెంచిండ్రు.. డీజిల్ ధరలు పెంచిండ్రు.. కిరాణా సామాను ధరలు పెంచిండ్రు.. వంట నూనెల ధరలు పెంచిండ్రు.. ఎరువుల ధరలు పెంచిండ్రు.. ఫోన్ చార్జీలు పెంచిండ్రు.. లాస్ట్‌కు బీమా సొమ్ము మీద కూడా పన్ను వేసిండ్రు.. చివరాఖరికి మందుగోలీల ధరలు కూడా పెంచిండ్రు.. ఇప్పుడిక ప్రయాణాల వంతు… టోల్ చార్జీలను భారీగా పెంచేందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేసింది..
హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్‌ట్యాక్సులు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత ట్యాక్స్‌పై పెంపుదల సగటున నాలుగు నుంచి నాలుగున్నర శాతం వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. టోల్‌ట్యాక్స్ పెంపుతో బస్సు ప్రయాణం మరింత భారం కానున్నది.
అంతేకాదు, ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలపై భారం మరింత పడనున్నది. జాతీయ రహదారుల ఫీజు (డిటర్మినేషన్ ఆఫ్ రేట్స్ అండ్ కలక్షన్) నిబంధనలు-2008 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏటా టోల్‌ట్యాక్సుల సవరణ చేపడుతున్నది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెరిగిన టోల్‌ట్యాక్స్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
ప్రతి కిలోమీటర్‌పై రూ.3 పెంపు
గత సంవత్సరం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వివిధ రకాల వాహనాలకు 10-15 శాతం వరకు టోల్ట్యాక్స్ను పెంచింది. ప్రస్తుతం జాతీ య రహదారులపై ప్రతి కిలోమీటర్‌కు అది రూ. 2.19గా ఉన్నది. తాజాగా మళ్లీ పెంచడంతో ప్రతి కిలోమీటరుకు రెండున్నర నుంచి మూ డు రూపాయల భారం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ప్ర స్తుతం హైదరాబాద్ నుంచి నాగపూర్ వరకు రూ.1000 వరకూ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, పెంపు తరువాత ఇది రూ.1100-1200 వరకు ఉండే అవకాశమున్నదని వారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పరిధిలో వివిధ మార్గాల్లో జాతీయ రహదారులపై 32 టోల్గేట్లు ఉండగా, వాటిపై ప్రస్తుతం రూ.1800 కోట్లకుపైగా టోల్‌ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గడచిన తొమ్మిదేండ్లలో కేంద్రం టోల్‌చార్జీలను 300 శాతం పెంచడం గమనార్హం. గడిచిన తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటడంతో నిత్యావసర ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. దీనికితోడు టోల్ట్యాక్స్లు కూడా ఏటా ఐదు నుంచి పది శాతం వరకూ పెంచుతుండటంతో నిత్యావసర వస్తువుల భారం ఏటేటా పెరుగుతున్నది.