Peddapalli | పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించారు. శనివారం ”దర్జాగా దారి దోపిడీ..” అనే శీర్షికతో నమస్తే తెలంగాణ మెయిన్‌లో, ”గేటెయ్.. దోచేయ్..” అనే శీర్షికతో పెద్దపల్లి జిల్లా మినీలో ప్రచురితమైన కథనంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు.
మానేరు నది వద్దకు చేరుకున్న మంథని సీఐ రాజు, ఆర్ఐ శ్రీధర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడికి చేరుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్‌నును తొలగించారు. ఎలాంటి వసూళ్లకు పాల్పడవద్దని అక్కడ టోల్గేట్ నిర్వాహకులను హెచ్చరించారు. దీంతో నిన్న మొన్నటి వరకు అనధికారికంగా వసూలు చేసిన టోల్ టాక్సీ బెడద ఆయా గ్రామాల ప్రజలకు తప్పింది. ఆ మట్టి రోడ్డుపై ప్రయాణం చేసే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను వెలికి తీసిన నమస్తే తెలంగాణకు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.