ఖమ్మం, నవంబర్ 28: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి, దాని ప్రాముఖ్యత గురించి భావితరాలకు తెలియజేసేందుకు ఖమ్మంలో శుక్రవారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఖమ్మంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ జైత్రయాత్రో.. కేసీఆర్ శవయాత్రో’ అనే నినాదంతో నాడు దీక్ష చేపట్టిన కేసీఆర్ను అప్పటి పాలకులు కరీంనగర్లో అరెస్ట్ చేయించి ఖమ్మం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాటి కేసీఆర్ ఉద్యమ చరిత్రను, ఉద్యమంతో ఖమ్మానికి ఉన్న అనుబంధాన్ని దీక్షా దివస్ సందర్భంగా చాటి చెప్పేలా బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. 15 ఏండ్ల క్రితం కేసీఆర్ చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్.. శాంతియుత పద్ధతిలో తెలంగాణను సాధించినట్టు తెలిపారు. అబద్ధాలతో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు.