ఒక స్వప్నం నిజమైన రోజు. ఒక సత్యం రుజువైన రోజు. తెలంగాణ విముక్తి పోరులో పతాక సన్నివేశం ఆవిష్కృతమైన రోజు. తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గమని నమ్మిన గాంధేయం ముందుకు కదిలిన రోజు.. సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన రోజు. ఢిల్లీ గద్దెను కదిలించిన రోజు. స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పిన రోజు. గెలుపు పిలుపు వినిపించిన రోజు.. అది తెలంగాణ నుదుటిరాతను మార్చిన దీక్ష. తెలంగాణను దరిజేర్చిన దీక్ష. కేసీఆర్ అనే మూడక్షరాలతో పెనవేసుకున్న దీక్ష. ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష లేకుండా తెలంగాణ ప్రకటన లేదు.. బిల్లు లేదు, చట్టం లేదు.. అందుకే అది తెలంగాణ ఎన్నడూ మరువని రోజు. నవంబర్ 29న జరుపుకొనే పండుగ రోజు.
చరిత్రలో కొన్ని సందర్భాలు మైలురాళ్లవుతాయి. సువర్ణాక్షరాలతో లిఖించే పేజీలవుతాయి. శిలల మీద చెక్కే శాసనాలవుతాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ అలాంటిదే! ఆ సందర్భం.. ఆ దీక్ష సాగినన్ని రోజులు రాష్ట్రంలో నెలకొన్న ఉద్వేగం.. కట్టలు తెంచుకున్న యువత ఉద్రేకం.. టీవీల ముందు వార్తల కోసం ఎదురుచూసిన ప్రజల ఆరాటం.. ఇవన్నీ కండ్లతో చూసిన వాళ్లకే తెలుస్తుంది, తెలంగాణ సాధనలో కేసీఆర్ దీక్షకు ఉన్న పాత్ర ఏమిటో. ఇవాళ ఎవరో ఏదో అనవచ్చు. ఎవరెవరో గుంపులో గోవిందలు సాధన క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవచ్చు. అందుకు పచ్చమీడియా పడరాని పాట్లు పడవచ్చు. కానీ 2001లో తెలంగాణ జెండా ఎగరేసి సింహగర్జన చేసింది కేసీఆర్.. 14 ఏండ్లపాటు ఆటుపోట్లన్నీ ఎదుర్కొని, సీమాంధ్ర పాలకుల కుట్రలను ఛేదించి, తెలంగాణ సమాజాన్నంతా ఒక్కతాటి మీదికి తెచ్చింది.. కేసీఆర్ నడిపిన మెయిన్ స్ట్రీం ఉద్యమమే.
ఆ ఉద్యమ ప్రభంజనంలో చేరిన చిన్న చిన్న పాయలను పచ్చ మీడియా గొప్పగా చూపించి డైవర్షన్ కోసం నాటకాలు నడిపి ఉండవచ్చు. కానీ తెలంగాణ ప్రకటనలో ప్రతి అక్షరం కేసీఆర్‌ను సంప్రదించాకే చేర్చారు. ఆ తర్వాత చరిత్ర అంతా.. ‘తెలంగాణ ప్రకటనకు ముందు.. ప్రకటన తర్వాత’ మాత్రమే. ఆ దీక్షకు.. ఆ ప్రకటనకు ఉన్న ప్రాధాన్యమది. తెలంగాణ ప్రజలు సజల నయనాలతో ఒళ్లంతా కండ్లు చేసుకొని చూసిన ‘ద బిల్ ఈజ్ పాస్డ్..’ అని ఆనాటి డిప్యూటీ స్పీకర్ కురియన్ నోట పలికిన ఓంకార నాదానికి పునాది కేసీఆర్ నడిపిన దీక్షే! అధిష్ఠానం ముందు తెలంగాణ ఇమ్మని అడగని పిపీలికాలు ఇవాళ దీక్ష గురించి సోయిలేని మాటలు మాట్లాడుతున్నారు. హిందీలో ఓ నానుడి ఉంది.. ‘జో జీతా. వొహీ సికిందర్’ అని.. అవును కేసీఆర్ తెలంగాణ సికిందర్!!
వరంగల్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశను మార్చిన అపురూప ఘట్టం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించి ఆమరణ నిరాహారదీక్ష కోసం సిద్దిపేటకు బయలుదేరి సరిగ్గా నేటికి 16 ఏండ్లు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులపాటు సాగిన కేసీఆర్ ఆమరణ దీక్ష దిగంతాలను ఏకంచేసింది. స్వరాష్ట్ర చరిత్రలో అజరామరఘట్టంగా నిలిచిపోయింది. కేంద్రంలోని కాంగ్రె స్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌కు కేసీఆర్ దీక్ష తెలంగాణను ఇవ్వక తప్పని అనివార్యతను సృష్టించింది. 2009 నవంబర్ 29న మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా నాటి ఉమ్మడి పాలకులు సాగించిన నిర్బంధకాండ, కరీంనగర్ నుంచి ఖమ్మం దాకా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ప్రయాణం, రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన నిరసన జ్వాలలు, ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి ఆత్మార్పణంతో తెలంగాణ అగ్నిగుండంగా మారడం.. ఇలా ఆనాడు జరిగిన ప్రతి ఘట్టం తెలంగాణ స్ఫూర్తిని చాటేదే.
తెలంగాణ సాధన కోసం సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ఉద్యమసారథి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. 2009 నవంబర్ 28న హైదరాబాద్ నుంచి బయలుదేరి కరీంనగర్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బసచేశారు. 29వ తేదీన ‘జై తెలంగాణ’ నినాదాలతో తెల్లారింది. కరీంనగర్ పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు కేసీఆర్‌ను చుట్టుముట్టారు. ఉద్యమశ్రేణులు వలయాలు.. వలయాలుగా కేసీఆర్‌కు రక్షణ కవచంగా నిలిచి పోలీసులను ప్రతిఘటించాయి. దీంతో తాత్కాలికంగా పోలీసులు వెనక్కితగ్గారు.
సిద్దిపేటలోని ఆమరణ నిరాహార దీక్షాస్థలికి వేలాది మంది ఉద్యమకారులు కరీంనగర్ నుంచి కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడివారిని అక్కడే కట్టడి చేసేందుకు పోలీసులు వారి వాహనాల టైర్లలో గాలి తీసేశారు. హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి వచ్చే వందలాది వాహనాలను అలుగునూర్ చౌరస్తాలో నిలిపివేశారు. వేలాది మందిని దారిమళ్లించారు. అలుగునూర్ చౌరస్తాలో మూడు చెక్‌పోస్టులు పెట్టిమరీ పోలీసులు రోడ్లను బ్లాక్ చేశారు. బ్రిడ్జి ముందు రెండు చెక్‌పోస్టులు పెట్టి కార్యకర్తలు, నాయకుల వాహనాలను కట్టడి చేశారు.
కేసీఆర్ ఇంటి నుంచి అలుగునూర్ చౌరస్తా వరకు ఉన్నది 4 కిలోమీటర్లే. రోడ్డంతటినీ పోలీసులు బ్లాక్ చేశారు. ఆ తర్వాత తమ ప్లాన్‌ను అమలు చేశారు. కరీంనగర్ పట్టణంలో ఎడమవైపు ఉన్న కేసీఆర్ కాన్వాయ్‌ను సుభాష్‌నగర్‌లో కుడివైపునకు మళ్లించారు. అన్ని వాహనాలను పక్కకు తప్పించి ఓవర్టేక్ చేసి కేసీఆర్ వాహనంతోపాటు పోలీసు సిబ్బంది వాహనాలను మానేరు వంతెన దాటించారు. కేవలం రెండు వెహికిల్స్, ఆ తరువాత కేసీఆర్ వాహనం, ఆ వెనుక పోలీసు వాహనాలు మాత్రమే ఉన్నాయి.
అలుగునూర్ చౌరస్తా నుంచి కేసీఆర్‌ను అరెస్టు చేసి బస్సులో ఎక్కించిన తర్వాత, ముందు వెనుకా పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు బయల్దేరాయి. దారిపొడవునా ‘ఇంకో రెండు గంటల వరకు రోడ్ల మీద మరోవాహనం నడవడానికి వీల్లేదు. రోడ్లకు ఇరువైపులా ఒక్క మనిషి ఉండటానికి వీల్లేదు’ అని అన్ని పోలీస్ స్టేషన్లకు స్టేట్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వైర్లెస్ మెసేజ్ వెళ్లింది. అంతే.. రోడ్లన్నీ నిర్మానుష్యం. ‘సిద్దిపేట ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్న కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేశారు’ అనే విషయం తెలంగాణ అంతటా దావానలంలా వ్యాపించింది. కరీంనగర్, వరంగల్ రహదారి క్షణాల్లో వందలాది మంది రోడ్లు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారనే విషయం తెలుసుకొని ముందే వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు రోడ్లకు ఇరువైపులా రోప్‌పార్టీలతో కంట్రోల్ చేశారు.
కేసీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ హసన్పర్తికి చేరువలో ఉందనగానే కాకతీయ విశ్వవిద్యాలయం, ఎస్డీఎల్సీఈ, గేట్లకు తాళాలు వేశారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, కేసీఆర్‌ను వరంగల్ కోర్టులో హాజరుపరిచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలిస్తారని లీకు ఇచ్చారు. దీంతో వందలాది మంది ఉద్యమకారులు వరంగల్ కోర్టు ముందు, సెంట్రల్ జైల్ ముందుకు చేరిపోయారు. అయితే కేసీఆర్‌ను అరెస్టు చేసిన ఆక్టోపస్ పోలీసులకు ఆయనను ఎక్కడికి తీసుకెళ్లాలి? అనే విషయంలో స్పష్టతలేదు.
కేసీఆర్ వాహనం అలుగునూర్ చౌరస్తాకు చేరగానే రెప్పపాటులో పోలీసులు వెహికల్లో ఉన్న కేసీఆర్‌ను కిందికి దింపారు. పోలీసులను కేసీఆర్ ప్రతిఘటించారు. ‘కదిలే సమస్యే లేదు.. నన్ను సిద్దిపేటకు వెళ్లనీయండి. లేదంటే ఇక్కడే దీక్షకు దిగుతా’ అని కేసీఆర్ రోడ్డుమీదే బైఠాయించారు. దారికి ఇరువైపులా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్దపెట్టున ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ నినాదాలు ప్రారంభించారు. తమ నాయకుడిని పోలీసుల చెర నుంచి విడిపించేందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ జయశంకర్‌కు కాలికి స్వల్ప గాయమైంది. దీంతో పోలీసులు నాటకీయంగా వ్యవహరించారు. జయశంకర్‌ను అక్కడే విడిచిపెట్టి కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి, విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, కన్నెబోయిన రాజయ్యయాదవ్ను విక్షణారహితంగా బస్సులో పడేశారు. అక్కడి నుంచి బస్సు బయలుదేరింది.
కేసీఆర్ బస్సు ఉన్న వాహన శ్రేణి మెరుపువేగంతో రోడ్ల మీద పరుగులు తీస్తూ, కేయూ ఎస్డీఎల్సీ దగ్గర ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు విగ్రహం నుంచి 100 ఫీట్రోడ్ వైపు మళ్లింది. ఫాతిమా సెంటర్ నుంచి కాజీపేట మీదుగా హైదరాబాద్‌కు తీసుకెళుతున్నారని ప్రచారం చేశారు. ఆ తర్వాత కడిపికొండ భట్టుపల్లి మీదుగా ఉర్సుగుట్ట, నాయుడు పంప్ మీదుగా ఖమ్మం రోడ్, వర్ధన్నపేట, రాయపర్తి మీదుగా తీసుకెళ్లడంతో కేసీఆర్‌ను రాజమండ్రికి లేదా సూర్యాపేటకు తరలిస్తున్నారనే ఊహాగానాలను పథకం ప్రకారం వ్యాప్తిలోకి తెచ్చారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తొర్రూర్, మరిపెడ మీదుగా ఖమ్మం చేర్చారు. హైదరాబాద్, వరంగల్ అయితే ఉద్యమం తీవ్రరూపు దాలుస్తుందని, ఖమ్మంలో మణుగూరు, కొత్తగూడెం సింగరేణి ఏరియా మినహా పెద్ద ప్రమాదం ఉండదని భావించిన ఉమ్మడి పాలకులు కేసీఆర్‌ను ఖమ్మం తరలించారు.
నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్‌ను ఖమ్మం చర్చి కాంపౌడ్‌లోని సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీరామమూర్తి నివాసానికి (ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో) తీసుకెళ్లారు. పథకం ప్రకారం అప్పటికే ఖమ్మం పోలీస్ స్టేషన్లో కేసీఆర్ సహా మిగతా నాయకులపై రాజద్రోహం నేరం కింద కేసు నమోదు చేశా రు. కేసీఆర్, ఇతర నేతలకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో జడ్జి ఇంటి నుంచి నేరు గా ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించి, వైద్య పరీక్షలు చే యించారు. అక్కడి నుంచి దానవాయిగూడెంలో ఉ న్న సబ్‌జైల్‌కు తరలించారు. దీంతో పోలీసులు తనను ఎక్కడ (అలుగునూర్ చౌరస్తా) అయితే ముట్టుకున్నారో (అరెస్టు) అక్కడి నుంచే తన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైందని కేసీఆర్ ప్రకటించారు.
కేసీఆర్‌ను అరెస్టు చేసి వరంగల్‌వైపు తరలిస్తున్నారని తెలియగానే కేటీఆర్ పోలీసు వాహనాన్ని అనుసరిస్తూ ముందుకు కదిలారు. అలుగునూర్ నుంచి బయలుదేరి కేయూ సెకండ్గేట్ దగ్గరికి చేరుకోగానే పోలీసులు కేటీఆర్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్‌ను, విద్యార్థులను పట్టుకొని అక్కడినుంచి తరలిస్తుండగా మెరుపువేగంతో తప్పించుకున్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న జయశంకర్ ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు.
అలుగునూర్ చౌరస్తాలో గాయపడిన జయశంకర్‌ను పోలీసులు ఆయన ఇంట్లో వదిలారు. కేటీఆర్.. జయశంకర్ ఇంటికి చేరుకొని కేసీఆర్ తరలింపు విషయాన్ని క్షణక్షణం తెలుసుకుంటూ కింకర్తవ్యం ఏమిటి? అనే కోణంలో సమాలోచనలు జరిపారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా కేటీఆర్.. జయశంకర్ ఇంట్లోనే విద్యార్థులతో కలిసి దీక్ష చేపట్టారు. మరోవైపు హరీశ్‌రావు సిద్దిపేటలోని కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టే వేదిక మీద దీక్షకు దిగారు. కేసీఆర్ సహా ముఖ్యనేతలంతా దీక్షకు దిగడంతో తెలంగాణ నేలనేలంతా ఉద్యమ పిడికిలైంది. తెలంగాణ అంత టా ఉద్యమ జెండాలెత్తింది. కేసీఆర్ అరెస్టును తట్టుకోలేక హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో యువకు డు శ్రీకాంతాచారి స్వరాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకొని తొలి అమరుడయ్యారు.
ఉస్మానియా, కాకతీయ సహా విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు ఉద్యమంలోకి దిగాయి. ఆమరణదీక్ష చేపట్టిన కేసీఆర్‌ను ఖమ్మం సబ్‌జైల్ నుంచి ఖమ్మం దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆరోగ్యం క్షీణిస్తున్నా, డాక్టర్లు హెచ్చరిస్తు న్నా.. కేసీఆర్ పచ్చిగంగ కూడా ముట్టలేదు. ప్రాణంపోయినా సరే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించే తీరుతానని శపథం పట్టారు. మరోవైపు, నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు తెలంగాణ అగ్నిగుండమైంది.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులను ప్రజలు తిరగనీయని అనివార్యతను తెలంగాణ సృష్టించింది. కేసీఆర్ తెగింపు.. ప్రాణత్యాగానికైనా వెనుకాడని పట్టుదల, ఉవ్వెత్తున రగులుతున్న తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ వణికింది. ఫలితంగా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం’ అని ప్రకటించారు. ఆ తర్వాత సమైక్యవాదుల రాజీనామాలతో మళ్లీ మొదటికి వచ్చినా.. ఢిల్లీ పెద్దలు యూటర్న్ తీసుకున్నా.. తెలంగాణ ప్రజలు పట్టు వదలలేదు. తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేసింది. 2014 జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినంగా ప్రకటించింది. ఇలా తెలంగాణ నిలిచి, గెలిచేందుకు దీక్షా దివస్ దారిచూపింది.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదం ఇచ్చి, తడారిపోతున్న ఉద్యమ జ్వాలను ఉవ్వెత్తున రగిలించి నేటికి పదహారేండ్లు. 11 రోజుల కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలించి, కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేయించిన మరుపురాని రోజు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గతిని మార్చి, చరిత్రను మలుపుతిప్పిన నాటి ప్రత్యేక పోరాట జ్ఞాపకాలను ‘దీక్షా దివస్’ వేదికగా మరోసారి నెమరేసుకోవాలని గులాబీ దళం సంకల్పించింది. ఈ అపూరుప సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వాడవాడలా గులాబీ జెండాలతో అలంకరించింది. బీఆర్ఎస్ ఆఫీసులను పార్టీ జెండాలు, కేసీఆర్ ఫ్లెక్సీలతో ముస్తాబు చేసింది. గులాబీ వర్ణపు విద్యుత్తుకాంతులద్ది అట్టహాసంగా జరుపుకొనేందుకు సర్వం సిద్ధంచేసింది. ‘ఔర్ ఏక్ దక్కా తెలంగాణ పక్కా..’ అంటూ ప్రతి తెలంగాణ బిడ్డ నోటి నుంచి ప్రతిధ్వనించిన నినాదాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గం సుగమమైన ఘట్టాలను నెమరువేసుకునేందుకు ప్రజలు సైతం ఉద్యమ స్ఫూర్తితో సిద్ధమయ్యారు.