వరంగల్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): మహిళల రాజ్యాధికారానికి గుర్తుగా ప్రసిద్ధిగాంచిన కాకతీయ గడ్డ వరంగల్ నగరానికి తెలంగాణ ప్రభుత్వం మరో గుర్తింపు తెచ్చింది. తెలుగు నేలను పాలించిన రాణీరుద్రమ ఇలాకాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నది. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి కార్యక్రమం మొదలుకానున్నది. రాష్ట్ర స్త్రీ శిశు, మహిళాసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన 27 మంది మహిళలకు ప్రభుత్వం ప్రకటించిన మహిళా పురస్కారాలను అందజేసి సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.