Home Guards | హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు రాష్ట్రంలో ‘తెలంగాణ రైజింగ్’ పేరిట వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ 75వ రైజింగ్డేను గాలికి వదిలేసిందని హోంగార్డులు వాపోతున్నారు. దేశంలో హోంగార్డుల వ్యవస్థ ప్రారంభమై 75 ఏండ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా.. డిసెంబర్ 6న ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన స్వర్ణోత్సవాలను ప్రభుత్వం, పోలీసుశాఖ గాలికి వదిలేసినట్టు తెలుస్తున్నది. ఒక్క రక్తదానం మినహా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర హోంశాఖ సిద్ధంగా లేదని రాష్ట్రంలో హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హోంగార్డుల రైజింగ్‌డే రోజున ప్రతియేటా కవాతు, స్పోర్ట్స్మీట్స్ నిర్వహించి తమను ప్రోత్సహించేవారని, ఆయా విభాగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి రివార్డులు, ప్రత్యేకంగా ప్రశంసాపత్రాలు ఇచ్చేవారని, ఆరోజు తమకు భోజన ఏర్పాట్లు కూడా చేసేవారని చెప్తున్నారు. తాము ఎంతగానో నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఇలా గాలికి వదిలేయడం ఆవేదనకు గురిచేస్తున్నదని అంటున్నారు. ఇది విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన వారిని అవమానించడమేనని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక సర్క్యూలర్ విడుదల చేసి, అన్ని జిల్లాల్లో ఘనంగా హోంగార్డుల రైజింగ్ డేను నిర్వహించాలని వారు కోరుతున్నారు.
‘అటెండర్‌కు ఎక్కువగా.. పోలీసుకు తక్కువగా’ డ్యూటీలు చేస్తున్న తమ సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపులేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి చెప్పిన విధంగా పెండింగ్‌లో ఉన్న యూనిఫాం అలవెన్స్‌ను వెంటనే ఇవ్వాలని, ఆర్డర్లీ వ్యవస్థను తొలగించాలని, 600కు పైగా ఉన్న కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. అలాగే హోంగార్డుల సాధారణ మరణానికి రూ.5 లక్షల నగదు ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చినట్టు ఇవ్వాలని, రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక భరోసా కల్పించాలని, ఆరోగ్య భద్రత తమకు కూడా వర్తింపచేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.