హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం..’ అని గతంలో సీఎం కేసీఆర్ చేసిన సాహసోపేత ప్రకటనను రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నేడు కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 2001 మే నెలలో కేసీఆర్ చేసిన ప్రకటన వార్త క్లిప్పింగ్‌ను ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌చేశారు. ‘మొదట నిన్ను పట్టించుకోరు.. ఆ తరువాత నిన్ను చూసి నవ్వుతారు. ఆపై నీతో గొడవ పడతారు.. అప్పుడే నువ్వు గెలుస్తావ్’ అని మహాత్మాగాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్లో ప్రస్తావించారు.
ఏపీ- తెలంగాణ ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి ఏపీ మంత్రి బొత్స సత్సనారాయణ కుమారుడి వివాహానికి శుక్రవారం మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్టర్లో షేర్ చేసిన కేటీఆర్ ‘నిన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడిని ఆశీర్వదించడానికి వెళ్లాను. ఏపీ నుంచి వచ్చిన సోదరులు చూపిన ప్రేమతో పొంగిపోయాను. భౌగోళికంగా విడిపోయి ఉండొచ్చు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగత ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి’అని ట్వీట్‌చేశారు.
కేటీఆర్‌కు ధన్యవాదాలు
అనారోగ్యం బారిన పడ్డ కూలీ కుమారుడికి తక్షణ సహాయం అందించిన మంత్రి కేటీఆర్‌కు బాధిత కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. 13 నెలల బాలుడు అనారోగ్యానికి గురవటంతో వెంటిలేషన్ అవసరం పడింది. ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేయటంతో, వెంటనే స్పందించిన మంత్రి.. సంబంధిత వర్గాలకు ఆదేశాలు జారీ చేసి, చికిత్సకు ఏర్పాట్లు చేయించారు. దీంతో ఆ బాలుడు కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపి ‘మీ సాయానికి కృతజ్ఞతలు’అని బాధిత కుటుంబం పేర్కొన్నది.