శేరిలింగంపల్లి, జూలై 31: ప్రభుత్యోద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ టీన్జీవోలు చేపట్టిన ఆందోళన గురువారంతో 12వ రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లు గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ చెవులు మూసుకొని నిరసన తెలిపారు.
ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున గత 16రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. భాగ్యనగర్ టీఎన్జీవో అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతోపాటు న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని కోరారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. భాగ్యనగర్ టీఎన్జీవోస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదాబేగం, సంధ్య, నర్సింహారాజు, ఏక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్, పలువురు ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.