TNGO | హిమాయత్ నగర్, ఏప్రిల్ 8 : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగులు సంఘటితమై ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదర్‌గూడలోని మున్సిపల్ ఛైర్మన్స్ ఛాంబర్ కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మారం జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ విభాగంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఉద్యోగులను స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప ఉద్యోగుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారoలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరొక మాట మాట్లాడుతుందని మండిపడ్డారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ ఇవ్వకుండా మేనేజర్ గ్రేడ్ అంటూ కాలయాపన చేయడం సరైన విధానం కాదన్నారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి పరిష్కారం చేసేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట గోపాల్, అసోసీయేట్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి శ్రీధర్ రెడ్డి, టీఎన్జీవో నగర అధ్యక్షుడు శ్రీకాంత్, నేతలు వెంకటేష్ బాబు, శ్రీనివాస్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.