హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలపై బూతులు మాట్లాడిన బీజేపీ నేతలు.. అంతటితో ఆగకుండా ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారు. విచక్షణ మరిచి నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. నిరుద్యోగ జేఏసీ ముసుగులో బీజేపీ మూకలు మంగళవారం మధ్యాహ్నం 12 తర్వాత నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి ఫర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు టీఎన్జీవో అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ నేమ్‌ప్లేట్‌ను పగులకొట్టారు. దుండగుల వీరంగంతో మహిళా ఉద్యోగులు భయాందోళనకు గురై బిక్కుబిక్కుమంటూ తలోచోట దాచుకొన్నారు. దాడికి పాల్పడిన వారిలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరుడు సురేశ్‌యాదవ్ ఉన్నట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఓయూ నిరుద్యోగ జేఏసీ పేరుతో సురేశ్‌యాదవ్ బీజేపీ నేతల వెంట తిరుగుతున్నాడని, ఇది బీజేపీ కుట్రలో భాగంగా జరిగిందని ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు. ఈ దాడిని టీఎన్జీవో కేంద్ర సంఘంతోపాటు, మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ తీవ్రంగా ఖండించారు.
కేసులైతే ఉద్యోగాలు రావని..
దాడికి పాల్పడిన దుండగులపై టీఎన్జీవో నేతలు మానవత్వం ప్రదర్శించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కఠినంగా శిక్షించాలని సహచర ఉద్యోగ సంఘాల నేతలు ఒత్తిడి తెచ్చారు. దాడి చేసింది ఓయూకు చెందిన వారు కావడం, కేసులు నమోదైతే ఉద్యోగా అవకాశాలు కోల్పోతారని భావించి ఆలోచనను ఉపసంహరించుకొన్నారు. కేసు నమోదు విషయంపై పోలీసులు టీఎన్జీవో నేతలను సంప్రదించినా వదిలేయాలని సూచించారు.
బండి వ్యాఖ్యలపై ఖండన
పదోన్నతులు, బదిలీలు, పైరవీల కోసం పాకులాడేవాళ్లంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను యూటీఎఫ్ ఖండించింది. ఇలా నోరుపారేసుకొనే బదులు సీపీఎస్ రద్దు కోసం, పాత పింఛన్ పునరుద్ధరణ కోసం ప్రయత్నించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జంగయ్య, చావ రవి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కు సూచించారు.
తిట్టడమే కాకుండా.. దాడులు చేస్తారా ?
ఉద్యోగులను దూషించడమే కాకుండా, టీఎన్జీవో భవన్‌పై దాడి చేయడం అత్యంత దారుణం. తెలంగాణ మనోభావాలను గౌరవించరు. ఉద్యోగులను గౌరవించరు. ఇదేం సంప్రదాయం ? మా మీద ఆరోపణలు చేయడమే కాకుండా దాడులకు పాల్పడుతారా ? బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలు, ఉద్యోగుల మనుసులు గెలవాలే తప్ప ఇలా ప్రత్యక్ష దాడులకు పాల్పడటం సరికాదు. టీఎన్జీవో కార్యాలయంపై దాడి చేయడమంటే..తెలంగాణ ప్రజలు, ఉద్యోగులపై దాడి చేసినట్టే.
– మామిండ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్
ఉద్యమకారులపై దాడి చేయడమే..
టీఎన్జీవో భవన్‌పై బీజేపీ కార్యకర్తల దాడి అత్యంత పాశవికం. మునుగోడులో ఓడిపోతున్నామనే ఆందోళనలో దాడులు చేయడం దిగజారుడు చర్య. టీఎన్జీవో భవన్‌పై దాడి చేయడమంటే తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేయడమే. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. బీజేపీ నేతలు ఇలాంటి దాడులు చేస్తే ప్రతిఘటిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– దేవీప్రసాద్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
సంజయ్ క్షమాపణలు చెప్పాలి
టీఎన్జీవో నేతలు అమ్ముడుపోయారన్న బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఆయనపై కేసులు పెట్టాలి. నిరాధారమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఉద్యోగులపై నోరుపారేసుకొనే వైఖరిని సంజయ్ మార్చుకోవాలి.
– మార్త రమేశ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు