హైదరాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ ) : రెండేండ్లుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచలేదని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం ముజీబ్ హుస్సేని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పోరాటాలకు పిలుపునివ్వాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని సీఎస్ కే రామకృష్ణారావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం-2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ హాజరై.. డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను టీఎన్జీవో నేతలు సీఎస్‌కు వివరించారు. పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లుల విడుదల, పాత పెన్షన్ విధానం అమలు, హెల్త్‌కార్డుల వంటి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. డీఏల సంఖ్య ఐదుకు చేరిందని చెప్పారు. ఆయా అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్టు నేతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.