హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణతోపాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు చక్కబడాలంటే 2024లో బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఒక కొత్త రాజకీయ వేదికగా ఉంటుందని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌కు ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు. డీ రాజా ఆదివారం ఢిల్లీలో ‘టీన్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు.
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
తీవ్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు నెలకొన్నాయి. దేశంలో ఆరెస్సెస్ అజెండా అమలవుతున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ నేరుగా నియంత్రిస్తున్నది. దేశంలోని యువత తీవ్ర అసహనంలో ఉన్నది. నిరుద్యోగం పెరుగుతున్నది. ఇది చాలా ఆందోళనకరం. మోదీ విధానాలతో రూపాయి విలువ పడిపోతున్నది. ధరలు మండిపోతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు 2024లో బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో లౌకికశక్తులతో కలిసి సైద్ధాంతిక పోరాటం చేయడమే సీపీఐ ముందున్న ప్రథమ కర్తవ్యం. విజయవాడలో నిర్వహించనున్న పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయం తీసుకొంటాం.
బీజేపీ బుల్డోజింగ్ పాలిటిక్స్‌ను ఎలా చూడవచ్చు ?
బీజేపీ, ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. బుల్డోజింగ్ పాలిటిక్స్‌ను నడుపుతున్నాయి. కేంద్రం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఆయా సంస్థల్లో రిజర్వేషన్ల అమలు వీలుకాదు. తద్వారా ప్రజలకు సామాజిక న్యాయం దకకుండాపోతుంది. మోదీ ప్రపంచంలోనే శక్తిమంతమైన నేతగా ఎదుగుతున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కార్పొరేట్ పాలసీలను అమలు చేస్తూ అదానీ, అంబానీ వంటి వాళ్లు ప్రపంచ కుబేరులుగా తాయరయ్యేలా చేశారు. జనాన్ని లూటీ చేసి దేశం నుంచి పారిపోయిన నీరవ్‌మోదీ, విజయ్ మాల్యా లాంటి మోసగాళ్లను పట్టుకోవడం బీజేపీకి చేతకావడం లేదు. మోదీ మాట్లాడే మాటలు నిజం కాదని ప్రజలు కూడా అర్థం చేసుకొన్నారు.
విజయవాడ సమావేశాల్లో ఎలాంటి రాజకీయ విధానాన్ని రూపొందిస్తారు?
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే ప్రత్యామ్నాయ ఆర్థికవిధానంపై దృష్టిసారిస్తాం. 2024లో మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తాం. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, గృహవసతి, నిత్యావసర వస్తువుల ధరలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం.
మోదీ హయాంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలను ఎలా అర్థం చేసుకోవచ్చు?
సమాఖ్య స్ఫూర్తికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఘాతం కలిగిస్తున్నది. రాష్ర్టాల జాబితాలో ఉన్న అంశాలపై భాగస్వామ్య ప్రభుత్వాలను సంప్రదించకుండానే కేంద్రం చట్టాలు చేస్తున్నది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాష్ర్టాల హక్కుల కోసం కేరళ, తెలంగాణ, తమిళనాడుతో సహా అనేక రాష్ర్టాలు కొట్లాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే.. ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నది. రాజకీయ కారణాలతో సెంట్రల్ ఏజెన్సీలను రాష్ర్టాలపైకి ఉసిగొల్పుతూ స్థానిక నాయకత్వాన్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. ఇది ఒకరకమైన నియంతృత్వం. అథారిటేటివ్, కార్పొరేట్ కమ్యూనల్ ఫాసిజం. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. కార్పొరేట్ సంస్థల నుంచి పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తూ బీజేపీ దేశంలోనే ధనిక రాజకీయ శక్తిగా ఎదిగింది.
జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది?
బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ వేదిక. సీపీఐ ఇతర పార్టీలతో కలిసి పనిచేయడానికి సైద్ధాంతిక, భావజాల దృకోణాలను పరిగణనలోకి తీసుకొంటుంది. బీఆర్ఎస్ సిద్ధాంతాలను, విధానాలను పరిశీలించాల్సి ఉన్నది. కేసీఆర్ మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. కేసీఆర్‌కు, ఆయన పార్టీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్నది. కేసీఆర్ అమలుచేస్తున్న ప్రజానుకూల పథకాలను కొనసాగిస్తూనే రాజకీయంగా బీజేపీ లాంటి పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాల్సి ఉం టుంది. పోరాడుతున్నారు. బీజేపీని ఓడిస్తేనే దేశం బాగుపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవచ్చు. దేశాన్ని బీజేపీ, ఆరెస్సెస్ కబంధ హస్తాల నుంచి రక్షించేందుకు బీజేపీని వ్యతిరేకించే లౌకిక పార్టీలు, ప్రజాసంఘాలు, శక్తులతో కలిసి పనిచేస్తాం.