ఖైరతాబాద్, మే 19 : మలిదశ తెలంగాణ ఉద్యమానికి టీజేఎఫ్(తెలంగాణ జర్నలిస్టుల ఫోరం)దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్, ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. టీజేఎఫ్ 25వ వసంతోత్సవం సందర్భంగా ఈనెల 31న జలవిహార్ వేదికగా ఉదయం 11 గంటలకు జరిగే రజతోత్సవ వేడుకల పోస్టర్‌ను సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్టు చంటి క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. 2001లో మలిదశ తెలంగాణ ఉద్య మం ప్రారంభమైన సంవత్సరంలోనే మొదటిసారిగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించినట్టు తెలిపారు. ఆంధ్రా మీడియా పెత్తనం సాగుతున్న తరుణంలో, జర్నలిస్టులు తటస్థంగా ఉండాలన్న ఒత్తిళ్ల సమయంలో తెలంగాణ ప్రజలతో కలిసి నడిచేందుకు టీజేఎఫ్ ఆలోచన పుట్టినట్టు చెప్పారు. ఆంధ్రా యాజమాన్యంలో పనిచేస్తూనే తెలంగాణ జర్నలిస్టులు ఒకే తాటిపై నిలబడడం గొప్ప విషయంగా పేర్కొన్నారు.
2011లో ఖైరతాబాద్‌లోని శ్రీధర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సమక్షంలో మాక్ అసెంబ్లీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించడం, తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీకి తాకేలా టీజేఎఫ్ 2వేల మందిని తరలించడం, గన్‌పార్క్ నుంచి ఆర్టీసీ కల్యాణమండపం వరకు 5 వేల మందితో నిర్వహించిన ర్యాలీ టీజేఎఫ్ చరిత్రలో మైలురాళ్లని గుర్తుచేశారు. లక్షలాది మందితో నిర్వహించిన మిలియన్ మార్చ్, సాగరహారానికి మూలకారణం కూడా టీజేఎఫ్ కావడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఎత్తుకొని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఘనత టీజేఎఫ్కే దక్కిందని స్పష్టంచేశారు. భవిష్యత్తు ఉద్యమాలకు టీజేఎఫ్ అనుసరించిన పంథా స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ చరిత్రను చిరస్మరణీయంగా ఉంచేందుకు రజతోత్సవ వేడుకలు జరుపనున్నామని, ఏడాదిపాటు వేడుకలు నిర్వహించాలని సంకల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏ రమణకుమార్, పీ శశికాంత్, ఎంవీ రమణ, పీ యోగానంద్, ఎల్ కల్యాణ్‌చక్రవర్తి, యార నవీన్‌కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, టీయూడబ్ల్యూజే నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాకేశ్‌రెడ్డి, సోమేశ్వర్, కోశాధికారి వీ బాపూరావు, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అగస్టీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.