శేరిలింగంపల్లి, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : బీటీఎన్జీవోలు కదం తొక్కారు. ‘మా భూములు మాకే కావాలని’ నినదించారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. బీటీఎన్జీవోలకు మద్దతుగా టీజేఏసీ నిలవడంతో గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి ప్రాంతం దద్దరిల్లింది. తమ స్థలాల్లో పాగా వేసిన ప్రైవేటు వ్యక్తులను వెళ్లగొట్టాలని బీటీఎన్జీవోలు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. భాగ్యనగర్ ఎన్జీవోస్ అధ్యక్షుడు, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం సయ్యద్ ముజీద్ హుస్సేనీ, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎలూరి శ్రీనివాస్‌రావు, కస్తూరి వెంకట్, జేఏసీ నాయకులతో కలిసి చేపట్టిన నిరసన కార్యక్రమాలు శుక్రవారంతో 17వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నా, మరోవైపు ప్రైవేటు వ్యక్తులు మాత్రం గోపన్‌పల్లి భూముల్లో పనులు మాత్రం ఆపడం లేదు.
ఉద్యోగుల బాధలను ప్రభుత్వం పట్టించుకోవాలని టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కోరారు. గోపన్‌పల్లిలో ఆందోళన కొనసాగిస్తున్న బీటీఎన్జీవోలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిస్తే జర్నలిస్టులకు భూములు కేటాయించవద్దని సుప్రీంకోర్టు ఆర్డరు ఉన్నదని చెప్పారని, అయితే అది ఉద్యోగులకు వర్తించదని చెప్పామని తెలిపారు. దీంతో న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. జర్నలిస్టులు వేసిన పిటిషన్ కూడా అడ్మిట్ అయిందని మంత్రి చెప్పారని వివరించారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. న్యాయ పోరాటం కొనసాగుతుందని, ఉద్యోగుల భూములు వారికి దక్కేవరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో కేటాయించిన 142.11 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి, అన్ని రకాలు ఫీజులను చెల్లించడంతో పాటు జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం స్థలాన్ని మార్టిగేజ్ చేశాక ఇప్పుడు కొందరు ప్రవేట్ వ్యక్తులు కోర్డు అర్డరు అడ్డంపెట్టుకొని పట్టదారులమని ఆక్రమంచడంతోపాటు నిర్మాణ పనులు చేపట్టడం దారుణమని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యను మానవీయ కోణంలో చూడాలని కోరారు. ఇటీవల రెవెన్యూ మంత్రి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కూడా కలిసి సమస్యను వివరించినట్టు తెలిపారు.
తమ స్థలాల్లో రాత్రికి రాత్రి కంటెయినర్లను ఏర్పాటుచేసి వాచ్‌మెన్‌ను తుపాకులతో బెదిరించి పనులు చేపట్టారని భాగ్యనగర్ టీన్జీవోస్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ అన్నారు. తాము గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి తమ స్థలాలు తమకు ఇచ్చే వరకు నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. అప్పటి వరకు అక్కడి నుంచి కదిలేదని లేదని తేల్చిచెప్పారు.