యాదాద్రి, సెప్టెంబర్ 3 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం తిరువీధి సేవ అత్యంత వైభవంగా సాగింది. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి స్వామివారిని గరుడ వాహనసేవ, అమ్మవారిని తిరుచ్చి సేవపై వేంచేపు చేసి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. దర్బార్ సేవలో భాగంగా నాలుగు వేదాలు పారాయణం చేసి, స్వామివారిని స్వస్తి మంత్రాలతో శాంతింపజేశారు. స్వామివారి సుదర్శన నారసింహ హోమంతోపాటు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకొన్నారు. స్వామివారి ఖజానాకు రూ.20,09,507 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.