హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించనున్న గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్ నుంచే కాక తిరుపతిలోని ప్రధాన కూడళ్ల నుంచి బస్సులను తిరుమలకు నడుపుతున్నారు. గురువారం సాయంత్రం 6 నుంచి 23న ఉదయం 6 గంటల వరకు తిరుమల కొండపై ద్విచక్ర వాహనాలకు అనుమతి రద్దు చేశారు.
తిరుమలలో జీఎన్సీ నుంచి వాహనాల పార్కింగ్ ప్రాంతాలు కేటాయించారు. వీవీఐపీ పెద్ద బ్యాడ్జీ వాహనాలకు రాంభగీచ వద్ద, వీఐపీ చిన్న బ్యాడ్జీలు ఉన్న వాహనాలకు ముల్లగుంట, సప్తగిరి గెస్ట్‌హౌస్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు పోలీసులు పార్కింగ్ పాస్‌లు కేటాయిస్తారని అధికారులు తెలిపారు.