హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొడంగల్ నియోజకవర్గానికి అనధికారిక ఎమ్మెల్యేగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ హోదా లేకున్నా నియోజకవర్గంలో జరిగే అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శుక్రవారం దౌల్తాబాద్ మండలంలో స్వయంగా అధికారులతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం నియోజకవర్గంలో ఆయన పెత్తనం తారాస్థాయికి చేరిందనడానికి నిదర్శనమని పేర్కొంటుర్నారు.
కొడంగల్‌కు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డా? ఆయన సోదరుడు తిరుపతిరెడ్డా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సీఎం సోదరుడు అయినంత మాత్రాన అధికారిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని నిలదీస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, స్థానిక ఎంపీకి కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులకు ఆదేశాలు జారీచేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తిరుపతిరెడ్డి సీఎం తమ్ముడు కావడంతో అధికారులు సైతం ఆయన చెప్పుచేతల్లో ఉంటున్నారని విమర్శిస్తున్నారు.
తిరుపతిరెడ్డికి రెండు కాన్వాయ్‌లు, గన్మెన్లను ఎందుకు అనుమతించారని దౌల్తాబాద్ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోట్ల మహిపాల్ ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కాన్వాయ్‌లు, గన్మెన్లను తొలగించకుంటే హైకోర్టులో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సీఎం బంధువులకు ప్రభుత్వ అధికారుల సేవలను వినియోగించడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెస్తారని అన్నారు. తిరుపతిరెడ్డి అరాచకాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎండగడతారని హెచ్చరించారు.