హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు తిరుమల మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కల్పవృక్ష వాహనంపై శ్రీవారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ జరిగింది. ఉత్సవాల సందర్భంగా భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం స్వామివారిని 86,859 మంది దర్శించుకోగా 37,173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న వివిధ కానుకల ద్వారా హుండీకి రూ.3.63 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.