హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : తిరుమల బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడసేవ మంగళవారం వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు. వెంకటగిరులన్నీ గోవిందనామస్మరణతో మార్మోగాయి. పెద్ద, చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై విహరించిన వేంకటేశుడు.. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. మూలవరులకు అలంకరించే లక్ష్మీకాసులహారం, మకరకంఠి ఆభరణాలను మలయప్పస్వామికి అలంకరించారు. టీటీడీ తిరుమాఢ వీధుల్లోని గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవకాశం కల్పించారు.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఐదోరోజు మలయప్పస్వామి మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పట్టువస్త్రాలు ధరించి, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి, పల్లకీలో కూర్చొని శ్రీకృష్ణస్వామితో కలిసి మాఢవీధుల్లో విహరించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు, అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.