అత్తో పోదాం రావే సర్కారు దవాఖానకు.. ఒకప్పుడు కోడలు అడిగితే.. బెదిరిపోయిన అత్త.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రభుత్వ వైద్యశాలల్లో దుర్మార్గమైన పరిస్థితులను చెప్తుంది.. పాట రూపంలో సాగే ఆ సంభాషణ ఓ సినిమాలోనిది! కానీ.. ఇప్పుడు సీన్ మారింది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా.. ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అని సంతోషంగా వెళ్లి వైద్యం చేయించుకొంటున్నారు. ఈ పరిస్థితి తెలంగాణలో మాత్రమే కనిపిస్తున్నది. కరోనా వేళ మూడు వేవ్‌లలో తెలంగాణలో రెండు లక్షల మందికిపైగా రోగులను నయం చేసింది ఐదు సర్కారు దవాఖానలే. స్వరాష్ట్ర ప్రజలకే కాదు.. ఇతర రాష్ర్టాల రోగులకు కూడా ఆపదలో అండగా నిలిచి ఊపిరి నిలిపాయి. నాడు ప్రభుత్వ దవాఖాన అంటే.. ప్రత్యక్ష నరకం.. నేడు ధన్వంతరి నిలయం.
ఒకప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటే.. మురికికూపం.. దవాఖానకు వెళ్తే ప్రాణాలతో బయటకి వస్తామో లేదో తెలియదు. బెడ్లు దొరకవు.. నేలమీదే పడుకోవాలి.. డాక్టర్ ఎప్పుడొస్తడో.. వైద్యం ఎప్పుడందుతుందో తెలియదు. మందులిస్తే అవి మంచివో.. కల్తీవో తెలియదు. పరీక్షలు చేయరు.. బయట బేరం పెట్టుకొని అక్కడే పరీక్షలు చేయించుకొమ్మంటరు.. లంచాలు.. అవినీతి.. భయంకరమైన దుర్గంధం.. వెరసి ఒక భయానక వాతావరణం.. ఇప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటే.. ఏ కార్పొరేట్ దవాఖాన అయినా దిగదుడుపే. ప్రపంచాన్ని భీకరంగా వణికించిన కరోనా మూడు వేవ్‌లలోనూ ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించి.. లక్షల మందిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసి ఇంటికి పంపించిన ఘనత ప్రభుత్వ దవాఖానలదే.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): సాధారణ జలుబు, దగ్గు ఉంటేనే.. పక్కనున్నవాళ్లు పారిపోయిన పరిస్థితుల్లో సైతం.. ప్రాణాలను హరించే కరోనా రోగులకు చికిత్సనందించడానికి ప్రభుత్వ దవాఖానల్లోని 50 వేల మందికి పైగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కృషిచేశారు. అతి తీవ్ర లక్షణాలతో బాధపడుతూ వచ్చిన వారిని ఆక్సిజన్, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సచేసి ఊపిరిపోశారు. ప్రధానంగా గాంధీ, టిమ్స్, ఎర్రగడ్డ ఛాతి, కింగ్‌కోఠి, వరంగల్ ఎంజీఎం దవాఖానల్లో 1,89,988 మందికి చికిత్సను అందించడం ఒక రికార్డు. ఒక్క గాంధీ దవాఖానలోనే 86,500 మంది క్రిటికల్ రోగులకు వైద్య సేవలు అందాయి.
తొలి కేసు నుంచే..
2020 మార్చి 2న రాష్ట్రంలో తొలి కరోనా కేసు వచ్చిన రోజునుంచే ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకొన్నది. ఇండోనేషియానుంచి వచ్చిన రామ్‌తేజ్ అనే వ్యక్తిలో కరోనా తేలడంతో గాంధీ దవాఖానలో చికిత్స చేశారు. అప్పటినుంచి గాంధీ దవాఖాన కరోనాకు నోడల్ కేంద్రంగా మారింది. అక్కడ ఇతర వైద్య సేవలన్నింటినీ నిలిపి వేసి, 2000 పడకలను కరోనా రోగులకే కేటాయించారు. 500 ఐసీయూ పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లను సమకూర్చారు. ఆ తరువాత మార్చి 22న మరో రెండు కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి క్రమంగా మహమ్మారి వేగం పుంజుకొని మార్చి 22న లాక్డౌన్ ప్రారంభమైన తరువాత క్లిష్ట పరిస్థితులను సైతం ఎదుర్కొంటూనే గాంధీతోపాటు, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన, కింగ్‌కోఠి జిల్లా దవాఖానలకు సేవలను విస్తరించారు. దీంతోపాటు వరంగల్ ఎంజీఎం దవాఖానలో కూడా కరోనా సేవలు అందించారు.
పురుడు పోసుకొన్న టిమ్స్
రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ముందుజాగ్రత చర్యగా తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలోని స్పోర్ట్స్ విలేజ్‌ని దేశ చరిత్రలోనే అక్కడాలేని విధంగా కొన్ని రోజుల వ్యవధిలోనే ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ను ఏర్పాటు చేసి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 1500 పడకల సామర్థ్యంతో టిమ్స్‌లో తొలి దశ నుంచి నేటి వరకు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో వైరస్ తీవ్రత అధికంగా ఉండి ఆక్సిజన్ అవసరం పెరగటంతో రాష్ట్రంలో 27,000 ఆక్సిజన్ పడకలను అందుబాటులోకి తెచ్చారు. మూడోవేవ్ వార్తలు కూడా రావడంతో ప్రతి దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా 5 వేల ఆక్సిజన్ పడకలను సిద్ధంచేసి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు.
కరోనా బాధితులకు ఎంజీఎం రక్ష
వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక దవాఖాన కరోనా బాధితులకు అండగా నిలిచింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ నుంచి వచ్చిన రోగులకు ఆపన్న హస్తం అందించింది. 2020 మార్చి 15న ఎంజీఎంలో 25 బెడ్లతో మొదలైన కరోనా సేవలు, 800 బెడ్లలో సేవలందించేందుకు సకల సౌకర్యాలు ఉన్నాయి. వీటిలో 100 ఐసీయూ-వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయి. కరోనా బారిన పడిన 70,388 మందికి ఔట్ పేషెంట్ విభాగంలో ఎంజీఎం సేవలు అందించింది. కరోనాతో ఇబ్బంది పడుతూ ఎంజీఎంలో చేరిన 14804 మంది కోలుకొని ఆరోగ్యవంతులు అయ్యారు. 2020 మార్చి 15 నుంచి 2021 మార్చి 31 వరకు ఉన్న కరోనా మొదటిదశలో 31,016 మంది ఔట్ పేషెంట్ విభాగంలో వైద్య సేవలు పొందారు. కరోనాతో ఎంజీఎంలో చేరిన 7,639 మందికి ఎంజీఎంలో చికిత్స చేశారు. 2021 మార్చి 31 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు ఉన్న కరోనా రెండో దశలో 39,372 మంది ఔట్ పెషెంట్ విభాగంలో వైద్యసేవలు పొందారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరిన 7,165 మందికి ఎంజీఎంలో చికిత్స చేశారు. కరోనా కారణంగా ఇబ్బంది పడి కోలుకొని అ తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ కారణంగా 149 మంది ఎంజీఎంలో చేరారు. వీరిలో అవసరమైన 68 మందికి ఆపరేషన్లు చేశారు. మిగిలినవారు సాధారణ వైద్య సేవలతో కోలుకొన్నారు.