హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అధికారులు విధిగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ భవనానికి ‘రాజిరెడ్డి భవన్’గా నామకరణం చేస్తూ 2020 ఫిబ్రవరి 24న బీఆర్ఎస్ ప్రభుత్వం జారీచేసిన జీవో 96 ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నదని పేర్కొంటూ.. ఆ జీవోను 4 వారాల్లో అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించింది. అందరికీ కనిపించేలా ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంపై ‘రాజిరెడ్డి భవన్’ అని బోర్డు ఏర్పాటు చేయాలని తీర్పు వెలువరించింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, న్యాయవాది రామవరం మాధవీరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల విచారణ చేపట్టి ఈ తీర్పు వెలువరించారు.
అంతకుముందు పిటిషనర్ తరఫున న్యాయవాది జీ మోహన్ సాయిబాబా వాదనలు వినిపిస్తూ.. తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కొత్త భవన నిర్మాణానికి 2017లో ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరయ్యాయని, దీంతో ఆ గ్రామానికి విశేష సేవలు అందించిన మాజీ సర్పంచ్ రాజిరెడ్డి పేరును ఆ భవనానికి పెట్టాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు. ఆ భవన నిర్మాణం కోసం రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు రాజిరెడ్డి కుటుంబసభ్యులు అంగీకరించారని, అనంతరం ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం గతంలో ఖమ్మం జిల్లా పెరువంచ గ్రామ పంచాయతీ భవనానికి ‘జలగం వెంగళరావు భవన్’గా నామకరణం చేసిన ఉదంతాన్ని పరిశీలించిందని, తిమ్మాపూర్ పంచాయతీ భవనానికి ‘రాజిరెడ్డి భవన్’గా పేరు ఖరారు చేస్తూ జీవో 96ను జారీ చేసిందని వివరించారు.
ఆ జీవోకు అనుగుణంగా తిమ్మాపూర్ పంచాయతీ భవనంపై ‘రాజిరెడ్డి భవన్’ అనే బోర్డును ఏర్పాటు చేశారని, ఆ తర్వాత రాజకీయ కక్షలతో జీ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ పేరును ధ్వంసం చేయడంపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారని తెలిపారు. వాదనల అనంతరం ప్రభుత్వ రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. జీవో 96 ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నదని, దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. తిమ్మాపూర్ పంచాయతీ కార్యాలయంపై ‘రాజిరెడ్డి భవన్’ పేరును 4 వారాల్లోగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించింది.