హైదరాబాద్ సిటీబ్యూరో, బన్సీలాల్‌పేట్/కాశీబుగ్గ/ఎదులాపురం, జూన్ 21: జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిరక్షించాలని, సకాలంలో ైస్టెపెండ్ చెల్లించి, దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి వినతి పత్రం అందించినా స్పందించడంలేదని వాపోయారు. ఈ నెల 24లోగా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. ర్యాలీ నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. గ్రేటర్ పరిధిలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, మానసిక రోగుల దవాఖాన, వరంగల్ ఎంజీఎం దవాఖాన, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో జూడాలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి జూడాలకు ఇచ్చే ైస్టెఫండ్ను ప్రతి నెల సకాలంలో విడుదల చేయాలని, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనం చెల్లించాలని, తెలంగాణాలో ఏపీ విద్యార్థులకు ఇస్తున్న 15 శాతం రిజర్వేషన్ తొలగించాలని, హాస్టల్, భద్రత సదుపాయం కల్పించాలని, ఉస్మానియా దవాఖానకు నూతన భవనం నిర్మించాలని, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు వేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఇదివరకే రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చి మూడు రోజులైందని తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ దవాఖానలో జూడా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ వంశీ, ప్రధాన కార్యదర్సి లౌక్య నిరసనలో పాల్గొన్నారు.