హైదరాబాద్ జనవరి 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఈ నెల 28 నుంచి జూన్ 17 మధ్యలో పలు విడతలుగా జీ-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం పోలీసు ఉన్నతాధికారులు, ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, పాస్పోర్ట్ ఆఫీసు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్డీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ సంస్థల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 29 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారని తెలిపారు. చివరి అత్యున్నతస్థాయి సమావేశం ప్రధాని నేతృత్వంలో సెప్టెంబర్లో జరుగుతుందని చెప్పారు.
జనవరి నుంచి దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహించనుండగా.. వాటిలో హైదరాబాద్లో ఆరు సమావేశాలు జరుగుతాయని డీజీపీ వెల్లడించారు. జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా మార్చి 6, 7, ఏప్రిల్ 26, 27, 28, జూన్ 7, 8, 9, తిరిగి 15, 16, 17 తేదీల్లో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వరింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశాలకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని చెప్పారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్, వారు బసచేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు.