హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పండుగొస్తే ప్రయాణికులకు అవస్థలు కల్పించడం.. స్పెషల్ బస్సుల పేరిట భారీగా క్యాష్ చేసుకోవడం టీజీఎస్ఆర్టీసీకి పరిపాటిగా మారింది. మహాలక్ష్మి పథకం తెచ్చినప్పటి నుంచి ప్రయాణికులపై భారీగా భారం మోపుతున్నది. తాజాగా శనివారం రాఖీ పర్వదినాన ఆడబిడ్డలకు సరిపోను ఉచిత బస్సు సర్వీసులను కల్పించని అదే ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో వెళ్లేలా పాచిక పన్నింది. ఆ ప్రత్యేక బస్సుల్లో ఉన్న చార్జీల కంటే సుమారు 50 నుంచి 100 శాతం వరకు అదనపు భారం మోపింది. దీంతో రాఖీ పండగకని ఇంటికి వెళ్లాలనుకుంటే అదును చూసి ఆర్టీసీ సంస్థ నిలువుదోపిడీ చేస్తున్నదని లక్షలాది మంది ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఉదయం నుంచే 50 శాతానికి పైగా పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం.. రాఖీ పండగకు నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరించినట్టు శనివారం ఉదయం ఆర్టీసీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
స్పెషల్ బస్సుల్లో మాత్రమే 50 శాతం టికెట్ ధరలు పెరిగినట్టు వెల్లడించింది. రద్దీకి తగ్గుట్టుగా ఈ ఏడాది 3,500కు పైగా సిటీ బస్సులు, డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సు సర్వీసులను స్పెషల్ బస్సులుగా నడిపారు. కొన్ని రూట్లలో రెగ్యులర్ బస్సులు, స్పెషల్ బస్సులు కనిపించనేలేదని, వెరసి బస్సుల కోసం గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని మహిళలు చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో పెరిగిన టికెట్ ధరలతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు. స్పెషల్ బస్సుల పేరుతో ఎక్కువగా హైదరాబాద్ సిటీలో తిరిగే ఆర్డినరీ, మెట్రో సర్వీసు బస్సులే ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. వాటిల్లో కూర్చొని కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ వంటి దూరపు ప్రాంతాలకు అసౌకర్యంగానే వెళ్లాల్సి వచ్చిందని పలువురు తెలిపారు.
అవాక్కైన ఆడబిడ్డలు
బస్టాండ్లలో ఉన్న రద్దీకి భయపడి పిల్లా పాపలతో వెళ్లిన ఎందరో ఆడబిడ్డలు ఖర్చైనా కూడా ప్రత్యేక బస్సుల్లో వెళ్లారు. బస్సెక్కాక అదనపు చార్జీలతో కండక్టర్లు కొట్టే టిక్కెట్లు చూసి అవాక్కవడం వారి వంతయింది. సాధారణ రోజుల్లో టికెట్ రూ.100 ఉంటే.. స్పెషల్ బస్సుల పేరుతో రూ.150 వరకు వసూలు చేశారు. రూ.200 టికెట్ ధర ఉంటే రూ.300 తీసుకున్నారు. కొన్నిచోట్ల రెట్టింపు టికెట్లతో క్యాష్ చేసుకున్నారు. పెరిగిన ధరలను చూపుతూ ప్రయాణికులను ఆర్టీసీ నిలువుదోపిడీ చేస్తున్నదని సోషల్ మీడియా వేదికగా వందలాది మంది ఎండగడుతున్నారు. సీఎం రేవంత్ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానన్నది ఇలాగేనా? అంటూ మండిపడుతున్నారు. ఈ రాఖీకి ఆర్టీసీ కోట్లల్లోనే ఆర్జిస్తుందని, మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం నష్టాలను పూడ్చుకునేందుకే ఈ దుర్మార్గాన్ని ఎంచుకున్నదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
రెగ్యులర్ బస్సులు ఆపి.. స్పెషల్ బస్సులు వదిలి..
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణలోని 11 రీజియన్లలోని 97 బస్ డిపోలు మహిళా ప్రయాణికులతో కిటకిటలాడాయి. శుక్రవారం సాయంత్రం నుంచే అన్ని బస్టాండ్లలో విపరీతమైన రద్దీ కనిపించింది. శనివారం ఉదయం డిపోలకు ఏ బస్సు వచ్చినా చార్జీలతో సంబంధం లేకుండా సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. గంటల తరబడి బస్సుల కోసం వేచిచూసిన వారు.. వచ్చిన ఒక్క బస్సును అందుకోవాలని పిల్లలను వెంటేసుకొని సీట్ల కోసం పరుగెత్తారు. ఇక ఉచిత బస్సులు కంటికి కనిపించడకపోవడంతో స్పెషల్ బస్సుల్లోనే ప్రయాణాలు సాగించారు. ఎప్పటిలాగే బస్సు సర్వీసుల సంఖ్యను పెంచకపోవడంతో ఎప్పటికో వచ్చిన ఉచిత బస్సుల్లో సీట్ల కోసం ఆడబిడ్డలకు శిగపట్లు తప్పలేదు. ఆయా డిపోల నుంచి రెగ్యులర్గా తిరిగే బస్సులను ఆపి.. వాటిల్లో కొన్నింటికి స్పెషల్ బోర్డులు తగిలించి తిప్పారని ప్రయాణికులు మండిపడ్డారు. తద్వారా తమ భావోద్వేగాలతో ఆడుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకున్నారే కానీ.. ఎక్కడా సరైన ఏర్పాట్లు చేయలేదని వాపోతున్నారు.
ప్రత్యేక బస్సుల్లోనే టికెట్ ధరల సవరణ: ఆర్టీసీ
రాఖీ పండుగకు తెలంగాణ ఆడబిడ్డలు ఇబ్బందులు పడొద్దనే స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక బస్సుల్లోనే 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించినట్టు పేర్కొన్నది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని తెలిపింది. ఈ నెల 11 వరకు నడిచే స్పెషల్ బస్సుల్లోనే ఈ సవరణ చార్జీలు వర్తిస్తాయని అన్నది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించుకోవాలని 2003 నాటి జీవో ప్రకారం చార్జీలు పెంచినట్టు తెలిపింది.
బస్ చార్జీల పెంపు వివరాలు