హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): మొన్నటి వరకు టికెట్ రేట్ల పెరుగుదల ఉండదని చెప్పిన ప్రభుత్వం తాజాగా ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా, ఈ వ్యవహారంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లో మంత్రుల నివాస సముదాయంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టికెట్ రేట్ల పెంపు విషయంపై స్పందించారు. సినీ పరిశ్రమ వ్యవహారాలకు, టికెట్ రేట్ల పెంపునకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొకిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చి తప్పు చేశానా అని అప్పట్లో చాలా మదనపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ బాధతోనే బాబు వైద్య ఖర్చులు కూడా తానే భరించానని, ఆ ఘటన తన మనసును బాధించిందని గుర్తుచేసుకున్నారు. ఆ విషాద ఘటన తర్వాతే తాను కఠిన నిర్ణయం తీసుకున్నానని, ఇకపై టికెట్ రేట్ల పెంపు కోసం ఎవరూ తన వద్దకు రావద్దని సినీపెద్దలకు తేల్చి చెప్పినట్టు మంత్రి స్పష్టం చేశారు. ఆ హెచ్చరిక వల్లే ప్రస్తుతం పరిశ్రమ నుంచి తనను ఎవరూ కలవడం లేదని, ఇప్పుడు సినిమాల టికెట్ ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని, ప్రస్తుత రేట్ల వ్యవహారం తన పరిధిలో లేదని కోమటిరెడ్డి కుండబద్దలు కొట్టారు.
‘పుష్ప సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేశాను. రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతి ఫైల్ నా దగ్గరకు రాలేదు. నాకు తెలియకుండానే రెండు సినిమాల జీవోలు వచ్చాయి. నేను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదు.. పెట్టదల్చుకోలేదు’ అని స్పష్టంచేశారు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి సినిమా పరిశ్రమ గురించి పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలన ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా దశాదిశ లేకుండా తయారైందని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.