హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి.
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో అత్యధికంగా 7.16 సెం.మీ వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా రామగిరిలో 5.98 సెం.మీ, పెద్దపల్లిలో 4.43 సెం.మీ, వరంగల్ జిల్లా గీసుగొండలో 5.67 సెం.మీ, హనుమకొండ జిల్లా ఖాజీపేటలో 4.76 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 4.54 సెం.మీ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జాలూర్పాడ్లో 4.13 సెం.మీ, సిద్దిపేట అర్బన్‌లో 3.93 సెం.మీ, కరీంనగర్ జిల్లా వీణవంకలో 3.88 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.