హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడంతో నేల సారం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు ఉత్పత్తి చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా, వాటిని సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించాలని మంత్రి తుమ్మల సూచించారు.
కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్(ఎన్ఎంఈవో-ఓపీ) కార్యక్రమం అమల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఎన్ఎంఈవో-ఓపీ జాతీయ వ్యవసాయ సదస్సు 2026’ జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు పురోగతిని వెల్లడించారని తుమ్మల తెలిపారు. ఎన్ఎంఈవో-ఓపీ మిషన్ కింద 2021 నుంచి 2026 వరకు దేశవ్యాప్తంగా 2,73,084 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేయగా, 98,112 హెక్టార్లతో తెలంగాణ 36 శాతం వాటా కలిగి ఉండటం గర్వకారణమని చెప్పారు.