Telangana | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి కన్నుమూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సాంబాయిగూడెంలో సాయి కుమార్, లిఖిత దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కల్మిష అనే మూడేళ్ల కుమార్తె ఉంది. మంగళవారం సాయంత్రం లిఖిత నిద్రపోతున్న సమయంలో కల్మిష ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లింది. తోటి పిల్లలతో ఆడుకుంటూ అక్కడే ఉన్న ఓ కారులోకి ఎక్కింది. ఆ సమయంలో కారు డోర్లు పడి లాక్ అయిపోయాయి. దీన్ని మిగతా పిల్లలు గమనించలేదు. కారులో లాక్ అయిన కల్మిష.. మిగతా పిల్లలను చూస్తూ ఏడుస్తూ ఉంది. కానీ బయటకు రాలేకపోయింది. ఈ క్రమంలోనే స్పృహ లేకుండా కారులోనే పడిపోయింది.
సాయంత్రం సమయంలో గాలి దుమారం వస్తుండటంతో తన పాప కోసం లిఖిత బయటకు వచ్చింది. కానీ పాప కనిపించలేదు. దీంతో ఆందోళన చెంది చుట్టుపక్కల అంతా వెతికింది. ఇంతలో కారులో స్పృహ తప్పిన కల్మిష కనబడింది. కారు లాక్ తీసిన దంపతులు.. పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.