Siddipet | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరబోతున్నాయి. ఇకపై గంటన్నరలోనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్ సహా పలు రైల్వే స్టేషన్ల నుంచి సిద్దిపేటకు రైళ్లు నడిపించాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. గత నెలలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్) ఆధ్వర్యంలో ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు రైల్వే రూట్ సర్వే కూడా పూర్తి చేసినట్టు అధికారులు చెప్తున్నారు. సిద్దిపేటలో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో ఈ స్టేషన్ మీదుగా ప్యాసింజర్ రైళ్లు నడపాలని కోరుతూ మంత్రి హరీశ్‌రావు రైల్వే అధికారులకు మూడు ప్రతిపాదనలతో వినతిపత్రం కూడా అందజేశారు. సిద్దిపేట ప్రాంత ప్రజలకు హైదరాబాద్‌తో అనుబంధం ఎక్కువ. కాబట్టి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మార్గంలో అయితే ఎంతలేదన్నా మూడు గంటల సమయం పడుతుంది. అదే రైలు ప్రయాణంలో గంటన్నరలోనే చేరుకునే అవకాశం ఉంది. దీనికి తోడు రైల్వే పాస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తే రూ. 350తోనే నెలంతా సిద్దిపేట-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వెసులుబాటు లభిస్తుంది. సిద్దిపేటకు రైలు వల్ల కాలంతోపాటు ఆర్థిక ఉపశమనం కూడా కలుగుతుంది.
మూడు రైళ్లకు ఆమోదం
అందుబాటులోకి వచ్చిన సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి మూడు రైళ్ల రాకపోకలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా మైసూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును సిద్ధిపేట నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి, నారాయణాద్రి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకదానిని ఇక్కడి నుంచే నడిపించే యోచన కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. వీటితోపాటు సిద్దిపేట-కాచిగూడ మధ్య పుష్పుల్ రైలును నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.