మళ్లీ ఉమ్మడి పాలననాటి రోజులు కనిపిస్తున్నయ్. ఉద్యమకాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నయ్. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు.. నేడు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణ యత్నాలు. అగ్నికీలలు.. ఆగ్రహజ్వాలలు.. విషాదమేమిటంటే నాడూ నేడూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే!
రేవంత్ సర్కార్ ఎగవేసిన హామీల సాక్షిగా.. సమ్మె ఉధృతంగా సాగుతున్న వేళ.. ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఒకేరోజు ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. నర్సంపేట బస్ స్టాండ్‌లో శంకర్‌గౌడ్.. నల్లగొండ డిపో ఎదుట వెంకన్న.. ఖమ్మంలో లింగారెడ్డి.. ఆత్మహత్యకు యత్నించారు. ముగ్గురూ డ్రైవర్లే. అందరూ కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన బాధితులే.
నర్సంపేట/వరంగల్ చౌరస్తా/నల్లగొండ సిటీ/మయూరి సెంటర్, ఏప్రిల్ 23 : కాంగ్రెస్ సర్కార్ నమ్మక ద్రోహం.. సమ్మె విచ్ఛిన్నానికి చేస్తున్న కుట్రలతో కలత చెందిన ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు గురువారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. ఆ హక్కును కూడా రేవంత్ ప్రభుత్వం కాలరాస్తున్నదని, ఇక తమ సమస్యలు పరిష్కారమయ్యే దారి కనిపించడం లేదన్న మనస్తాపంతో నర్సంపేటలో ఓ డ్రైవర్ ఒంటికి నిప్పంటించుకోగా 80 శాతం శరీరం కాలిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

నల్లగొండ బస్ డిపో ఎదుట ఓ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకోగా తోటి కార్మికులు వెంటనే రక్షించారు. ఖమ్మం జిల్లాలో ఓ డ్రైవర్ తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. ఆర్టీసీ సమ్మె రెండో రోజున జరిగిన ఈ మూడు ఘటనలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించగా కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఈ దుర్ఘటనలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మికలోకం డిమాండ్ చేసింది.
తోటి కార్మికులతో కలిసి నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ సమ్మెలో పాల్గొంటున్నాడు. ప్రభుత్వ మొండి వైఖరి, ఆర్టీసీ యాజమాన్యం తీరుతో ఇక తమ సమస్యలు పరిష్కారం కాబోవని మధనపడ్డాడు. గురువారం బాటిల్లో రెండు లీటర్ల పెట్రోల్ తెచ్చి బైక్‌లో పెట్టాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఆలోచనలతో కలతచెంది బస్టాండ్‌లో అందరూ చూస్తుండగా ఒంటిపై పెట్రోల్ పెసుకొని నిప్పటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే అతని శరీరం 80 శాతం కాలిపోయింది. హుటాహుటిన శంకర్‌గౌడ్‌ను నర్సంపేట ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అతడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నంతో నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఘటనతో ఆగ్రహించిన కార్మికులు ప్రభుత్వం, యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘సీఎం డౌన్.. డౌన్’, ‘కాంగ్రెస్ ప్రభుత్వ మొండివైఖరి నశించాలి’, ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం’ అంటూ పెద్దపెట్టున నినదించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వచ్చి నిరసనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు.
శంకర్‌గౌడ్‌ను ఎంజీఎంహెచ్కు తరలించిన సమయంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దగ్గరుండి స్ట్రెచర్సై క్యాజువాలిటీకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి చేరుకొని శంకర్‌గౌడ్‌కు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ వైఖరి కారణంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బరిగీసి కొట్లాడుదామని భరోసా కల్పించారు.

ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అతడికి మెరుగైన వైద్యం అందించాలని, లేదంటే సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎర్రబెల్లి హెచ్చరించారు. సమ్మెను ప్రభుత్వం అణగదొక్కలాని చూసిందని అందుకే శంకర్‌గౌడ్ మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ చెప్పారు.
అంతకు ముందు వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేతల రాకను దూరం నుంచి గమనించిన శంకర్‌గౌడ్ ఒక్కసారిగా బెడ్ మీది నుంచి లేచి రెండుచేతులూ జోడించి..‘దయన్నా.. పెద్దన్నా’ అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి నమస్కారం చేశారు. ‘ఏం కాదు.. ధైర్యంగా ఉండు’ అంటూ నేతలు ధైర్యం చెప్పారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు ఉధృతంగా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడుపగా కార్మికులు పలుచోట్ల అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి కార్మికులను నిలువరించారు. పలుచోట్లు డ్యూటీకి రావడం లేదని డిపో మేనేజర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆందోళనల్లో పాల్గొన్న కార్మికులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
సమ్మె అదునుగా ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల్లో చేతివాటం చూపిస్తున్నారు. ఒక్కో కండక్టర్‌కు రోజుకు రూ.800, డ్రైవర్‌కు రోజుకు రూ.1000 ఇస్తుండటంతో వాటితోపాటు ప్రయాణికులు ఇచ్చే డబ్బులను డిపోల్లో లెక్క చెప్పకుండా దండుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పురుషులకు కూడా జీరో టికెట్లు ఇస్తూ ఆ డబ్బులు సంస్థకు లెక్క చెప్పడం లేదని, టికెట్లు కొట్టేటప్పుడు మిగిలిన డబ్బులను డిపోల్లో అప్పజెప్పే ముందే స్నేహితులు, కుటుంబసభ్యులకు ఇచ్చి.. మిగిలినవి డిపోల్లో అప్పగిస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రయాణికులకు అసౌకర్యం కలగొద్దనే కారణంతో ప్రభుత్వం డ్రైవింగ్‌లో అనుభవం లేనివారిని డ్రైవర్లుగా తీసుకుంటుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ వద్ద ఆటోను బలంగా ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను ఢీకొట్టిన వెంటనే ప్రైవేట్ డ్రైవర్ పరారయ్యాడు. బర్కత్‌పుర డిపో నుంచి ఉదయం బస్‌ను బయటికి తీసే క్రమంలో డ్రైవర్ గోడకు ఢీకొట్టడంతో బస్సు ధ్వంసమైంది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల డిపోలు, హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఏపీ బస్‌లు అధికసంఖ్యలో నిండిపోతున్నట్టు రాష్ట్ర కార్మికులు చెప్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఏపీ బస్సులను ఇక్కడ తిప్పుతున్నారని వాపోతున్నారు. ఇది కూడా తమ సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని చెప్తున్నారు.

ఇక ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు, క్యాబ్స్ నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులపై అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా రూ.100, రూ.150 ఉండే రేట్లు అమాంతం రూ.500 నుంచి రూ.1000 రూపాయల వరకు పెంచేశారు. అంతా సిండికేట్‌గా మారి, ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని, రూట్ల వారీగా ధరలు పెంచి వసూలు చేస్తున్నారు. సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ భారం మరింతగా పెరుగుతున్నది. దూర ప్రాంతాలకు కార్లలో వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మిర్యాలగూడ డిపోలో డ్రైవర్‌గా పనిచేసే రావుల వెంకన్న నల్లగొండలో నివాసం ఉంటుండటంతో నల్లగొండ డిపో పరిధిలో సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మె విచ్ఛిన్నానికి సర్కార్ కుట్రలతో తీవ్ర మనోవేదన చెందాడు. గురవారం సాయంత్రం కార్మికులంతా నిరసనలో ఉండగా ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలని వెంకన్న భావించాడు. ముందే తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే తోటి కార్మికులు అప్రమత్తమై వెంకన్న చేతిలోని బాటిల్ లాగేసుకున్నారు.
అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి నీళ్లు పోసి బట్టలు మార్పించారు. పోలీసులు వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన వెంకన్నను జేఏసీ నేతలతో కలిసి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో కార్మికులు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని కార్మికులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఓవైపు తమ సమస్యలు పట్టించుకోని ప్రభుత్వ వైఖరి.. మరోవైపు ఇంటి సమస్యలతో సతమతమైన ఓ ఆర్టీసీ డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వెంపటి నగర్ చెందిన డీ లింగారెడ్డి.. భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉదయం సమ్మెలో పాల్గొనని మధ్యాహ్నం ఇంటికి వెళ్లాడు. కొద్దిరోజులుగా నెలకొన్న కుటుంబ కలహాలకు తోడు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళన చెంది గడ్డిమందు తాగినట్టు స్థానికులు తెలిపారు. లింగారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో దవాఖానలోనే న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు.