ఢిల్లీలో అందుకున్న మున్సిపల్ అధికారులు
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్‌శాఖ ప్రతిష్ఠాత్మక స్మార్ట్ సిటీస్ ఇండియా (ఎస్సీఐ) అవార్డుల్లో మూడింటిని దక్కించుకున్నది. వివిధ పథకాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు ఇవి దక్కాయి. ఐదేండ్లుగా వరుసగా ఇస్తున్న అవార్డులకు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 586 దరఖాస్తులు వచ్చాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ట్రెడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో), ఎగ్జిబిషన్స్ ఇండియా గ్రూప్ (ఈఐజీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 24 నుంచి 26వ వరకు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, 6వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో ఈ అవార్డులను తెలంగాణ దక్కించుకున్నది. బేగంపేటలోని రెయిన్ గార్డెన్‌కు, న్యూ మున్సిపల్ సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్కు, వీ హబ్‌కు అవార్డులు వచ్చాయి. వీటిని శుక్రవారం ఢిల్లీలో హెచ్‌డీసీఎల్ ఎండీ బీఎం సంతోష్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ బీ సంతోష్, ఎన్ఐయూఎం వంశీ కొండూజు అందుకున్నారు.