హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఎప్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొని, నచ్చని కాలేజీలో సీటు వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయ్యింది. సీట్లు రద్దుచేసుకునే అవకాశం లేకపోవడం, కట్టిన ఫీజులు వాపసు రాకపోవడంతో అంతా గందరగోళంగా తయారయ్యింది. ఇంజినీరింగ్ సీట్ల భర్తీలో భాగంగా ఇప్పటి వరకు మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసింది. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాతే విద్యార్థుల నుంచి ఫీజు కట్టించుకున్నారు. కాలేజీల్లో టీసీ, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్‌లు సమర్పించాలన్నారు. అయితే రెండో విడతలో సీటు కన్ఫర్మ్ చేస్తేనే మూడో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశమిస్తామన్నారు. దీంతో నచ్చిన కాలేజీలో సీటు రానివారు, మూడో విడతలో మంచి కాలేజీలో సీటు వస్తుందన్న ఆశతో ఫీజు కట్టి, కాలేజీల్లో టీసీలు సమర్పించారు.
కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి టీసీతోపాటు అన్ని రకాల సర్టిఫికెట్లు తీసుకున్నాయి. ఆదివారం మూడో విడత సీట్లు కేటాయించారు. మూడో విడతలోనూ విద్యార్థులకు నచ్చిన కాలేజీల్లో, బ్రాంచీలో సీట్లు రాలేదు. దీంతో డిగ్రీ లేదా ప్రైవేట్ వర్సిటీల్లో లేదా మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్లు పొందులానుకుంటున్నారు. రీయింబర్స్మెంట్ అర్హత ఉన్నవారు నామమాత్రపు ఫీజులు చెల్లించగా, జనరల్ క్యాటగిరీ విద్యార్థులు మొత్తం ట్యూషన్ ఫీజులు కట్టాల్సి వచ్చింది. మూడో విడత కౌన్సెలింగ్‌లో సీట్ల రద్దు ఆప్షన్ ఇవ్వలేదు. రెండో విడతలో ఫీజు కట్టిన వారికి వాపసు వచ్చే అవకాశంలేదు. దీంతో ఆయా విద్యార్థులు లబోదిబోమంటున్నారు.
ఇదే విషయంపై 15 మంది విద్యార్థులు ఎప్‌సెట్ క్యాంప్ ఆఫీసర్‌ను కలిసి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓ విద్యార్థికి ఇబ్రహీపట్నంలోని శ్రీదత్త కాలేజీలో సీటు రాగా, రెండో విడత తర్వాత ఫీజు చెల్లించి, సర్టిఫికెట్లు సమర్పించాడు. మూడో విడతలో మొయినాబాద్‌లోని జేబీఐటీ కాలేజీలో సీటు కేటాయించారు. ఈ రెండు సీట్ల పట్ల విద్యార్థి అయిష్టత చూపగా, ఇతను చెల్లించిన ఫీజులు వాపసు వచ్చే అవకాశం లేదని తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఇదే విషయంపై ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్‌ను ఆరా తీయగా, విద్యార్థులెవరైనా సీటు రద్దుచేసుకుంటే వారు చెల్లించిన ఫీజులను వాపసుచేస్తామన్నారు. సర్టిఫికెట్లను కాలేజీలోనే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.