హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీలోకి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించింది. ఇందులో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నర్సింహమూర్తికి స్థానం కల్పించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సమావేశమైన విషయం విదితమే. జల వివాదాల పరిష్కారానికి కేంద్రం, ఇరు రాష్ర్టాల అధికారులతో ప్రత్యేక కమిటీని వారంలోగా ఏర్పాటు చేసి, నెల రోజుల్లోగా నివేదిక తీసుకోవాలని ఆ భేటీలో నిర్ణయించారు. తొలుత 12 మందితో కమిటీని నియమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. కేంద్రం నుంచి జల్‌శక్తి శాఖ సెక్రటరీ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సీఈలు కమిటీకి నేతృత్వం వహించాలని, ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున అధికారులకు సభ్యులుగా చోటు కల్పించాలని నిర్ణయించారు.
అయితే, ఏపీ సర్కారు మాత్రం ప్రస్తుతం ముగ్గురు పేర్లను మాత్రమే ప్రతిపాదించడం గమనార్హం. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు విషయంలో తర్జనభర్జన పడుతున్నది. ఇప్పటికే రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగించే బనకచర్లపై చర్చలకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించడంపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు అంశంలోనూ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం సైతం కమిటీ ఏర్పాటు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే, కేంద్ర జల్‌శక్తి శాఖ కూడా అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఆ ప్రత్యేకాధికారుల కమిటీ ఇరు రాష్ర్టాల అధికారులతో సమావేశమై జల వివాదాలపై చర్చిస్తుంది.