హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించబడి.. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రహోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అంజనీకుమార్, తెలంగాణ పోలీసు అకాడమీ డీజీగా వ్యవహరిస్తున్న డీజీ అభిలాషబిష్త్, కరీంనగర్ సీపీగా విధులు నిర్వర్తిస్తున్న అభిషేక్ మొహంతీలను తక్షణం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్‌లను ఏపీకి కేటాయించారు. వాళ్లు తెలంగాణలోనే కొనసాగుతుండగా.. ఇటీవల కాలంలో ఐఏఎస్ అధికారులను కేంద్రం ఏపీకి పంపింది. వీరిలో ఐఏఎస్ అధికారులు అమ్రపాలి, వాణీప్రసాద్, వాకాటి కారుణ, రోనాల్డ్ రోస్, ప్రశాంతి ఏపీ ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష్ బిష్త్, అభిషేక్ మొహంతి కూడా ఏపీకి వెళ్లాల్సి ఉండగా.. తాజాగా వీరిని రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.