హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ) : కోటాకు మించి నాగార్జున సాగర్ జలాలను యథేచ్ఛగా మళ్లించుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలకూ ఎసరు పెట్టింది. ఆ జలాల్లోనూ వాటాకోసం పట్టుబడుతున్నది. 10 టీఎంసీలు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టింది. అడుగడుగునా ఏపీకి కొమ్ముకాస్తున్న కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సైతం తాజాగా ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నది. ఏడాదిపాటు ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయకుండా చూసీచూడనట్టు వ్యవహరించిన బోర్డు.. ఇప్పుడు ఏపీ కోరగానే 12వ తేదీన త్రీమెంబర్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రతిపాదనలన్నీ మూలకు నెట్టింది. ఈ ఏడాది ఇప్పటికే తాత్కాలిక కోటాకు మించి ఎలాంటి ఇండెంట్లను సమర్పించకుండానే సాగర్ నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోయింది. ఇంత జరుగుతున్నా రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్రలో కూరుకుపోయింది. ఏపీ సర్కార్ నీటి దోపిడీని నిలువరించకుండా, ఇదేమని బోర్డును నిలదీయకుండా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నది.
ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కృష్ణా జలాలను రికార్డ్ స్థాయిలో మళ్లించుకుపోయింది. తాత్కాలిక కోటా ప్రకారం 66:34శాతం నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు వినియోగించుకోవాల్సి ఉన్నది. ఈ కోటాకు మించి రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఏపీ జలాలను మళ్లించుకుపోయింది. దాదాపు 771.252 టీఎంసీలను (74.27శాతం) జలాలను తరలించుకుపోయింది. తెలంగాణ తన తాత్కాలిక కోటా 34 శాతాన్ని కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఈ ఏడాది కేవలం 25.77 శాతం అంటే 267.733 టీఎంసీల జలాలను మాత్రమే తెలంగాణ వినియోగించుకున్నది. కోటాలో భాగంగా 105.221 టీఎంసీల జలాలు వినియోగించుకోవాల్సి ఉన్నది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువయ్యాయి. రెండు రిజర్వాయర్లలో కలిపి మొత్తంగా అందుబాటులో ఉన్నదే 33 టీఎంసీలే. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా 18 టీఎంసీలు తెలంగాణకు అవసరం. ప్రధానంగా హైదరాబాద్ నగరం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉన్నది. అవిగాక వచ్చే సీజన్ వరకు తెలంగాణ తాగునీటి అవసరాలకు ఆ రిజర్వాయర్లపైనే ఆధారపడాలి. అంటే ఆ ఉన్న జలాలన్నీ తెలంగాణ కోటాలోనివే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాల్లోనూ 10 టీఎంసీలు కావాలంటూ బోర్డు వద్ద ఏపీ డిమాండ్ పెట్టింది. ఇప్పటికే కోటాకు మించి 38 టీఎంసీలు ఎక్కువగా మళ్లించుకుపోయిన ఏపీ.. తాజాగా ఉన్న రిజర్వాయర్లలోని ఉన్న కాస్తా నీటినిల్వలకు ఎసరు పెట్టాలని చూస్తున్నది.
కేఆర్ఎంబీ మొదటి నుంచీ ఏపీకే వత్తాసు పలుకుతున్నది. ఈసారి నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకునే వరకూ బోర్డు త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనేలేదు. ఏపీ నిరంతరాయంగా జలాలను మళ్లించుకుపోతున్నా ఇదేమని నిలువరించనేలేదు. జనవరిలో ఏర్పాటు చేస్తామని హడావుడి చేసిన బోర్డు.. ఆ తర్వాత ఎలాంటి కారణాలు చూపకుండానే వాయిదా వేసింది. ఏప్రిల్ 30న నిర్వహించాలని గతంలో బోర్డు నిర్ణయించగా, రాష్ర్టాల అభ్యంతరాలతో వా యిదా పడింది. త్రీమెంబర్ కమిటీ సమావేశ నిర్వహణకు అనుకూలమైన తేదీని చెప్పాలని బోర్డు రాష్ర్టాలనే కోరింది. 24గంటలు గడువకముందే ఏపీ ప్రతిస్పందించింది. 12వ తేదీన త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరడం.. తెలంగాణ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే అదే తేదీని బోర్డు కరారు చేయడం.. బోర్డు వివక్షకు అద్దం పడుతున్నది. ఏపీకి బోర్డు ఎంతలా సాగిలపడుతున్నదో దీన్నిబట్టే తెలిసిపోతున్నది.
కృష్ణా నీటి తరలింపులో ఏపీ బరితెగిస్తున్నదని తెలంగాణ ఇంజినీర్లే మండిపడుతున్నారు. దానికి కేఆర్ఎంబీ బోర్డు మద్దతుగా నిలుస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి దశలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చేవలేనితనం ప్రదర్శిస్తున్నదని మండిపడుతున్నారు. గుట్టుగా ఏపీకి సహకరిస్తున్నదని నీటిరంగ నిపుణులు సైతం నిప్పులు చెరుగుతున్నారు. ఈ నీటి సంవత్సరం ఆది నుంచే ఏపీ నిరాటంకంగా కృష్ణా జలాలను తరలింపును చేపట్టింది. ఈ ఏడాది పోతిరెడ్డిపాడు ద్వారా దాదాపు 240 టీంఎంసీలను మళ్లించింది. విషయాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఇంజినీర్లు తెలంగాణ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నారు. పదుల సంఖ్యలో లేఖలు రాశారు. ఏపీని అడ్డుకోవాలని ఉన్నతాధికారులు సైతం నేరుగా బోర్డు చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం స్పందించనేలేదు. బోర్డును నిలదీసింది లేదు. ప్రశ్నించిన పాపానపోలేదు. త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయకున్నా ఇదేమిటని రివర్ బోర్డును కాంగ్రెస్ సర్కార్ నిలదీయ లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏపీని అడ్డుకోవాలని బోర్డుపై తెలంగాణ సర్కార్ ఒత్తిడి తీసుకురాకపోవడం గమనార్హం.