TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంజినీరింగ్ విభాగంలో ఐదు, ఆరో సెషన్లలో హాజరైన విద్యార్థులకు మూడు మార్కుల చొప్పున కలిపారు. ఆ రెండు సెషన్లలో వచ్చిన ప్రశ్నపత్రంలోని మ్యాథ్స్ విభాగంలో మూడు ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. దీంతో ఆ రెండు సెషన్లలో హాజరైన విద్యార్థులందరికీ మూడు మార్కుల చొప్పున కలిపినట్లు ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు.
మ్యాథ్స్ ప్రశ్నపత్రం రూపొందించిన సమయంలోనే మూడు ప్రశ్నల విషయంలో ఈ తప్పిదం జరిగిందని తెలిపారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం మేరకు ఐదు, ఆరో సెషన్లలో హాజరైన విద్యార్థులకు మూడు తప్పుడు ప్రశ్నలకు గానూ మూడు మార్కుల చొప్పున కలిపారు. తొలి, రెండు, మూడు, నాలుగో సెషన్‌కు హాజరైన విద్యార్థులకు ఎలాంటి మార్కులు కలపలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని సూచించారు.
ఇంజినీరింగ్ విభాగంలో 80.33 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86.34 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. 2022 ఫలితాలను పరిశీలిస్తే.. ఇంజినీరింగ్ విభాగంలో 80.41 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 88.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది.