 
                                                            భీమదేవరపల్లి/కురవి, అక్టోబర్ 31: సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి సిద్దిపేట జిల్లా నుంచి పెళ్లి వాహనం బొలెరోను హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా బోర్వెల్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడ్డబోయిన స్వప్న (17), రెడ్డబోయిన కళమ్మ(55), రెడ్డబోయిన శ్రీనాథ్ (06) మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో సిద్దిపేట జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన అబ్బాయికి కురవి వీరభద్ర స్వామి దేవస్థానంలో మూడు రోజుల క్రితం వివాహం జరిగింది.
మూత్ర విసర్జన కారణంగా..
మారు పెండ్లికి వెళ్లిన బంధువులు, కుటుంబ సభ్యులు వధూవరులను తీసుకొని బొలేరో వాహనంలో గురువారం రాత్రి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో మూత్ర విసర్జన కారణంగా కిందకు దిగారు. అనంతరం బొలెరో వాహనం స్టార్ట్ చేసే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న బోర్ వెల్ లారీ పెళ్లి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో రెడ్డబోయిన స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ముల్కనూర్ ఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 108కు సమాచారం అందించగా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, హనుమకొండ జిఎంహెచ్, ఐఆర్సిహెచ్ అంబులెన్స్ ల్లో క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు.
ఆరుగురి పరిస్థితి విషమం..
రెడ్డబోయిన కళమ్మ, రెడ్డబోయిన శ్రీనాథ్ దవాఖానలో మృతి చెందారు. పెళ్లి వాహనం బొలెరోలో చిన్న పిల్లలతో కలిపి సుమారు 36 మంది ప్రయాణిస్తుండగా అనసూయ, అక్షయ, శివశంకర్, అక్షిత, చిక్కుడు దేవేందర్, రాజనర్సక్క పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు వరంగల్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పరామర్శించి, వారి చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బోర్ వెల్ వాహనం నడుపుతున్న వ్యక్తి పరారీలో ఉండగా, ముల్కనూర్ ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
                            