
లింగాలఘనపురం/కొండాపూర్ డిసెంబర్ 3: బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం చితికిపోయింది. కారు టైర్ పేలి ఎదురుగా వస్తున్న జీపును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. జనగామ-సూర్యాపేట జా తీయ రహదారిలోని లింగాల ఘనపురం మండలం వనపర్తి సమీపంలో ఈ విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. హైదరాబాద్‌లోని చందానగర్ పరిధి పాపిరెడ్డి కాలనీకి చెందిన జిన్న శేఖర్‌రెడ్డి(65).. తన బావ అం త్యక్రియల్లో పాల్గొనేందుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి శుక్రవారం ఉదయం కారులో బయలుదేరాడు. కొడుకు రఘుమారెడ్డి(28) కారు నడుపుతుండగా, వెనుక సీట్లో శేఖర్‌రెడ్డి, ఆయన భార్య ధనలక్ష్మి (62) కూర్చున్నారు. వనపర్తి గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లగానే కారు ముందు టైర్ పేలి అదుపు తప్పింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. జీపు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
20 నిమిషాల్లో గమ్యం.. అంతలోనే
హైదరాబాద్ నుంచి ఒక కారులో బంధువులు, మరో కారులో శేఖర్‌రెడ్డి కుటుంబం ఉదయం 8 గంటలకు బయలుదేరింది. ముందు కారులో వెళ్తున్న బంధువులు ఎప్పటికప్పుడు వీరి సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. 20 నిమిషాల్లో తిరుమలగిరి చేరుకొంటారనుకునే లోపే ఘోరం జరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. రఘుమారెడ్డికి ఏడాది క్రితమే వివాహమైంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొన్నది.